Keir Starmer: యూకే తదుపరి ప్రధానిగా కీర్ స్టార్మర్!

రిషి సునాక్ పాలనకు ముగింపు..

యూకే సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని రిషి సునాక్ ఘోర పరాజయాన్ని చవిచూశారు. లేబర్‌ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందింది. ఈ క్రమంలో లేబర్‌ పార్టీకి చెందిన కీర్ స్టామర్‌ బ్రిటన్ తదుపరి ప్రధాని అవుతారు. శుక్రవారం జరిగిన జాతీయ ఎన్నికల్లో రిషి సునాక్ ఓటమిని అంగీకరించారు. 650 సీట్లు ఉన్న యూకే పార్లమెంట్‌లో లేబర్‌ పార్టీ 400 సీట్లకు పైగా గెలుచుకుంది. ఈ క్రమంలో 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వ పాలనకు తెరపడింది. జులై 4న జరిగిన ఓటింగ్ ఫలితాలు ఇవాళ ఉదయం వెలువడ్డాయి. దీంతో లేబర్ పార్టీకి చెందిన నేత కీర్ స్టామర్‌ బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. రిషి సునాక్‌ కన్జర్వేటివ్ పార్టీకి ఇప్పటివరకు 80 సీట్లకు పైగా మాత్రమే వచ్చాయి. సునాక్ తన రిచ్‌మండ్, నార్తలెర్టన్ స్థానాలను గెలుచుకున్నారు. లేబర్ పార్టీ ప్రధాని అభ్యర్థి కీర్‌ స్టామర్ లండన్‌లోని హోల్‌బోర్న్, సెయింట్ పాన్‌క్రాస్ స్థానాలను గెలిచారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత, సునాక్ తన ఓటమిని అంగీకరించారు.

లేబర్‌ పార్టీ ప్రధాని అభ్యర్థి అయిన కీర్‌ స్టామర్‌ మాజీ మానవ హక్కుల న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్. 61 ఏళ్ల కీర్ స్టార్మర్ లండన్‌లోని ఆక్స్టెడ్‌లో జన్మించారు. అతని తండ్రి టూల్ మేకర్, అతని తల్లి NHS నర్సు. 2015లో తొలిసారి ఎంపీ అయిన కొద్ది రోజులకే కీర్ తల్లి మరణించారు. స్టామర్‌ సర్రేలోని ఒక చిన్న పట్టణంలో పెరిగాడు. కీర్‌కి ఇద్దరు పిల్లలు. ఆయన భార్య విక్టోరియా నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ఉద్యోగి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఆయన లేబర్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వంలో పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ (DPP) డైరెక్టర్‌గా కూడా ఉన్నారు.

50 ఏళ్ల వయసులో కీర్‌ స్టామర్ రాజకీయాల్లోకి రావడం గమనార్హం. ఫుట్‌బాల్‌లో ఆర్సెనల్ క్లబ్‌కు మద్దతు ఇచ్చే కీర్.. ప్రజలు మార్పును కోరుకుంటే వారు లేబర్ పార్టీకి ఓటు వేయాలని ఎన్నికలకు ముందు స్పష్టంగా చెప్పారు. దేశాన్ని గడ్డు పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావడానికి మా పార్టీ ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాలి.2019 తర్వాత లేబర్ పార్టీ ప్రధాన నాయకుడిగా అవతరించిన కీర్‌.. తమ ప్రభుత్వం మొత్తం దృష్టి దేశ ఆర్థిక వ్యవస్థ, జాతీయ ఆరోగ్య సేవపైనే ఉంటుందని చెప్పారు.

Tags

Next Story