India Russia Oil Trade : రష్యా చమురుకు ట్రంప్ బ్రేక్..భారత్‌కు అమెరికా బిగ్ ఆఫర్..పెట్రోల్ రేట్లు పెరగనున్నాయా?

India Russia Oil Trade : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. భారతీయ వస్తువులపై అమెరికాలో విధించే టారిఫ్‌లను (పన్నులను) 50 శాతం నుండి 18 శాతానికి తగ్గించారు. అయితే దీనికి ప్రతిగా రష్యా నుంచి ముడి చమురు కొనడం ఆపేయాలని గట్టి షరతు పెట్టారు. దీని ప్రభావం ఇప్పటికే గణాంకాల్లో కనిపిస్తోంది. డిసెంబర్ 2025లో రోజుకు 2.2 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురు కొన్న భారత్, జనవరి 2026 నాటికి దాన్ని 1 మిలియన్ బ్యారెళ్లకు తగ్గించేసింది. ఫిబ్రవరిలో ఇది మరింత తగ్గే అవకాశం ఉంది. అయితే నయారా ఎనర్జీ వంటి కంపెనీలు ఇప్పటికీ కొన్ని ప్రత్యామ్నాయ మార్గాల్లో రష్యా చమురును తెచ్చుకోవాలని చూస్తున్నా, ప్రభుత్వ పరంగా మాత్రం రష్యాపై ఆధారపడటం తగ్గుతోంది.
రష్యా చమురు ఆగిపోయినా భారత్ దగ్గర పక్కా ప్లాన్ ఉంది. రేటింగ్ ఏజెన్సీ ICRA ప్రకారం, వెనిజులా ఇప్పుడు భారత్‌కు పెద్ద దిక్కుగా మారబోతోంది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న వెనిజులా నుంచి భారీ ముడి చమురు తక్కువ ధరకు లభిస్తుంది. భారత్‌లో ఉన్న అత్యాధునిక రిఫైనరీలు ఈ రకమైన చమురును శుద్ధి చేయడంలో దిట్ట. వెనిజులాతో పాటు బ్రెజిల్ నుంచి కూడా భారత్ చమురు కొనుగోలును పెంచుతోంది. ఇక సంప్రదాయ భాగస్వాములైన సౌదీ అరేబియా, యూఏఈ ఎలాగూ ఉండనే ఉన్నాయి. అమెరికా నుంచి కూడా చమురు కొనే అవకాశం ఉన్నా, అది రష్యా చమురు కంటే ఖరీదైనది కావడంతో భారత్ చూపు వెనిజులా వైపే ఉంది.
చమురు ఉత్పత్తిలో ఏ దేశం ధర ఎంత?
ప్రపంచవ్యాప్తంగా చమురు తీయడానికి అయ్యే ఖర్చు దేశాన్ని బట్టి మారుతుంటుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ధరలను చూస్తే..
ఇరాక్: ఇక్కడ చమురు తీయడం చాలా చౌక. ఒక బ్యారెల్ చమురు ధర సుమారు $63.23.
కువైట్: అరబ్ దేశాల్లో ఇక్కడి చమురు క్వాలిటీ బాగుంటుంది. బ్యారెల్ ధర సుమారు $65.17.
సౌదీ అరేబియా: భూమికి దగ్గరగా నిల్వలు ఉండటం వల్ల ఇక్కడ తీయడం సులభం. బ్యారెల్ ధర సుమారు $65.82.
ఇరాన్: ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల వల్ల ఇక్కడ చమురు ధర $68.47 గా ఉంది.
సామాన్యుడి జేబుపై ప్రభావం ఎంత?
రష్యా నుంచి చౌకగా వచ్చే చమురు ఆగిపోయి, భారత్ అంతర్జాతీయ మార్కెట్ ధరలకు చమురు కొనాల్సి వస్తే వార్షిక దిగుమతి బిల్లు 9 నుంచి 12 బిలియన్ డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.5 నుంచి రూ.6 వరకు పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎక్సైజ్ డ్యూటీ(ఉత్పత్తి సుంకం) తగ్గించే అవకాశం ఉంది. ధరలు మరీ పెరిగితే పన్నులను తగ్గించి ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు.
ఆ తర్వాతే అసలు పరీక్ష
అమెరికాతో డీల్ కుదిరినా, చమురు సరఫరా రాత్రికి రాత్రే మారిపోదు. భారత కంపెనీలు ఇప్పటికే ఫిబ్రవరి వరకు రష్యాతో ఒప్పందాలు చేసుకున్నాయి. కాబట్టి మార్చి వరకు రష్యా చమురు సరఫరా కొనసాగుతుంది. ఒకవైపు రష్యా నుంచి పాత ధరలకే చమురు వస్తుంటే, మరోవైపు వెనిజులా, అమెరికాతో కొత్త మార్గాలు తెరుచుకుంటున్నాయి. మార్చి తర్వాత వెనిజులా నుంచి చౌక చమురు అందడం మొదలైతే, పెట్రోల్ పంపుల దగ్గర సామాన్యుడికి ధరల షాక్ తగలకుండా ఉండే అవకాశం ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
