ఏపీలో మరో ఓట్ల పండగ..

ఏపీలో మరో ఓట్ల పండగ..

ఏపీలో స్థానిక ఎన్నికలపై ఫోకస్‌ చేసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్‌. జులై మూడోతేదీ లోపు ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో మండల, జిల్లా పరిషత్‌ల కాలపరిమితి జులై 3, 4 తేదీల్లో ముగియనుండటంతో వాటికి ఎన్నికలు నిర్వ హించాల్సి ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల లిస్టులు సిద్ధమైన వాటి ఆధారంగా ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలకూ లిస్టులు తయారు చేసుకో వాలని సూచించారు. మండల, జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు సంబంధించి పంచాయతీల పరిధిలో అక్షర క్రమంలో లిస్టు రూపొందించాలని తెలిపారు.

వెంటనే మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ల ఎన్నికల కోసం ఓటర్ల జాబితాలు తయారు చేసే ప్రక్రియను ప్రారంభించాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. వచ్చే నెల 3వ తేదీకి మండల పరిషత్తుల ప్రాదేశిక సభ్యులు, 4వ తేదీకి జిల్లా ప్రజా పరిషత్తుల ప్రాదేశిక సభ్యుల పదవీ కాలం ముగుస్తున్నందున ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎంపీటీసీ ఓటర్ల జాబితాల తయారీ బాధ్యతను ఎంపీడీవోలు, జడ్పీటీసీ ఓటర్ల జాబితాల విషయంలో జడ్పీ సీఈవోలు బాధ్యతలు తీసుకోవాలని చెప్పారు.

ఎన్నికల కోసం గ్రామ పంచాయతీల వారీగా వరుస క్రమంలో మండల ప్రాదేశికాలను అమర్చుకోవాలని, వీటికి అనుగుణంగా ఓటర్ల జాబితాలను తయారు చేసుకోవాలని వివరించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం జూలై 3వ తేదీ నాటికి ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి వుంచుకోవాలని కూడా ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ రెండు ఓటర్ల జాబితాలను ఆయా కార్యాలయాల్లో నిర్ణీత తేదీ నాటికి సిద్ధంగా వుంచుకోవలసిందిగా ఆదేశించారు. మే 20వ తేదీన గ్రామ పంచాయతీల వారీగా ప్రచురించిన ఓటర్ల జాబితాలను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ల జాబితాలను రూపొందించాలని ఎంపీడీవోలను, సీఈవోలను ఎన్నికల కమిషనరు ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story