ఏపీలో తాజా పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేతలు

ఏపీలో తాజా పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేతలు

జగన్ ప్రభుత్వ తీరుపై ఇప్పటికే న్యాయపోరాటం చేస్తున్న టీడీపీ.. గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌ను కూడా కలిసింది. గురువారం విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన ఘటనలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు నేతలు. చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇచ్చిన పోలీసులే.. తరువాత అడ్డంకులు సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగా ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు పర్యటనను అడ్డుకున్నారు టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. శాంతి భద్రతల పేరుతో చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు.

గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో సమావేశమయ్యారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఘర్షణ వైఖరిని అవలంభిస్తున్నాయని చెప్పారు. స్నేహపూర్వకమైన రాజకీయాలు ఉండాలే తప్ప.. ఇలాంటి ఘర్షణ వాతావరణం రాష్ట్రంలో నెలకొనడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

కక్షతోనే విశాఖలో చంద్రబాబును అడ్డుకున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తినే ఇబ్బంది పెడితే సామాన్యుడి పరిస్థితి ఏంటిని నిలదీశారు. తన తల్లిని విశాఖ ప్రజలు ఓడించారన్న కక్షతోనే జగన్ అక్కడ ఫ్యాక్షనిజం చూపిస్తున్నారన్నారని విమర్శించారు.

వైసీపీ నేతలు విశాఖవాసులను అవమానిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి యనమల. ప్రజలను రౌడీలు, సంఘ విద్రోహులతో పోల్చుతున్నారని, వాళ్లే చంద్రబాబుపై కోడిగుడ్లు, టమాటాలు విసిరారంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

రౌడీయిజాన్ని ప్రేరేపిస్తూ విశాఖ , రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటోంది వైసీపీ నేతలేనన్నారు. అల్లర్లను ప్రోత్సహించి పెట్టుబడులు రాకుండా చేస్తూ స్థానికుల ఉపాధికి గండి కొడుతున్నారని ఆరోపించారు యనమల.

Tags

Read MoreRead Less
Next Story