భారత్‌లో విజృంభిస్తున్న కోవిడ్-19

భారత్‌లో విజృంభిస్తున్న కోవిడ్-19
X

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కోవిడ్-19 వైరస్‌ ఇటు భారత్‌లోనూ విజృంభిస్తోంది. రోజుకు రోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెగిరిపోతున్నాయి. తాజాగా ఈ సంఖ్య.. 45కు చేరింది. సోమవారం మరో ఆరుగురికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కేరళలో మూడేళ్ల చిన్నారి సహా జమ్ముకశ్మీర్‌లో ఓ మహిళ, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు, దిల్లీలో ఒకరికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అలాగే అమెరికా నుంచి భారత్ కు వచ్చిన బెంగళూరు వాసికి.. ఇటలీ నుంచి తిరిగొచ్చిన పంజాబ్ కు చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్టు గుర్తించారు.

కోవిడ్-19 వైరస్‌ తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటోంది. వైరస్‌ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటోంది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ శంషాబాద్ ఎయిర్‌పోర్టును సందర్శించారు. ఇంటర్నేషనల్ టర్మినల్‌లో ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ టెస్ట్ సెంటర్‌ను పరిశీలించారు. కరోనా వైరస్‌ను గుర్తించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఒకటే కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. అది కూడా దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తికే వైరస్ సోకింది. ప్రధానంగా ఇతర దేశాల నుంచి వస్తున్న వారితోనే కరోనా వైరస్ వస్తుండటంతో స్క్రీనింగ్ కేంద్రాల్లో మరింత జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఈటల.

మరోవైపు కరోనా వైరస్‌ విస్తరించకుండా తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అన్ని చర్యలు తీసుకుంటోందని చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌ వెల్లడించారు. కరోనా వైరస్‌ నివారణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై కేబినెట్‌ సెక్రటరీ...రాష్ట్రాల చీఫ్‌సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కోవిడ్-19 వైరస్‌ నివారణకు అన్ని రాష్ట్రాలు సమన్వయంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. సాధారణ ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించి, వ్యాధి ప్రబలకుండా అవగాహనా కార్యక్రమాలు విస్తృతం చేయాలని కూడా రాజీవ్‌గౌబ ఆదేశించారు. అన్ని చెక్‌ పాయింట్‌లను తనిఖీచేయాలని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా వైరస్‌ పరీక్షల కోసం రెండు లేబొరేటరీలను ఏర్పాటు చేయాలని సీఎస్‌ కోరారు.

కోవిడ్-19 కట్టడికి అటు ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. వైద్య అధికారులను నియమించి పర్యవేక్షిస్తున్నారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. రక్త నామునాలు గాంధీ ఆస్పత్రికి పంపించి.. వారికి వైరస్‌ లేదని నిర్ధరణ అయ్యే ఇంటికి పంపిస్తున్నారు.

కోవిడ్-19 ఎఫెక్ట్ తో ప్రధాని మోదీ.. బంగ్లాదేశ్‌ పర్యటన రద్దు అయ్యింది. ఈ నెల 17న బంగ్లాదేశ్‌ జాతిపిత షేక్‌ ముజిబర్‌ రెహమాన్‌ వందేళ్ల జయంతి వేడుకల ప్రారంభానికి హాజరుకావాలని తొలుత ఆయన నిర్ణయించారు. అయితే తమ దేశంలో ముగ్గురికి కరోనా వైరస్‌ సోకినట్లు గుర్తించిన బంగ్లాదేశ్‌.. ప్రారంభ వేడుకలను వాయిదా వేయాలని నిర్ణయించింది. వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

Next Story

RELATED STORIES