Top

ఏపీలో పతాక స్థాయిలో వైసీపీ దౌర్జన్యకాండ

ఏపీలో పతాక స్థాయిలో వైసీపీ దౌర్జన్యకాండ
X

కర్ర ఉన్న వాడిదే బర్రె. ఇదే సామెత ఇప్పుడు ఏపీలో జరుగుతున్న అరాచకాల సాక్షిగా రుజువు అవుతోంది. స్థానిక ఎన్నికల వేళ జిల్లాల్లో దౌర్జన్య కాండ పతాక స్థాయిలో ఉంది. ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో అధికారపార్టీ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేస్తోంది. బుజ్జగింపులు, బెదిరింపులకు లొంగకపోతే భౌతిక దాడులకు దిగుతున్నారు. బుధవారం పల్నాడులో TDP మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, MLC బుద్దా వెంకన్నలపై దాడితో భయానక వాతావరణం కనిపించింది. కావాలనే టార్గెట్ చేసి మరీ వాళ్లను వెంటాడినట్టు ఈజీగా అర్థమవుతోంది. ఈ దాడి వెనుక అధికార పార్టీ వ్యూహం ఏంటి? పోటీలో ఉన్న అభ్యర్థులకు వార్నింగ్ ఇచ్చేందుకేనా ఇలా చేసింది అంటే ఔననే సమాధానమే వస్తోంది.

పలు చోట్ల MPTC, ZPTCల ఏకగ్రీవాల కోసం YCP శ్రేణులు ఎంతటికైనా సిద్ధమన్నట్టుగా ప్రత్యర్థులతో కలబడ్డాయి. అధికారబలంతో ముందు ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు చేశారు. కొన్ని చోట్ల వాళ్ల వ్యూహం ఫలించింది కూడా. మరికొన్ని చోట్ల నామినేషన్లు వేయకుండా TDP, BJP వాళ్లను అడ్డుకున్నారు. నామినేషన్ పేపర్లు చించేయడం, అభ్యర్థుల్ని కిడ్నాప్ చేయడం ఒకటేమిటి ఎంత అరాచకం చేయాలో అంతా చేశారు. మంత్రి పెద్దిరెడ్డి ఇలాకాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ పోటీ నుంచి తప్పుకోకపోతే ఏం జరుగుతుందో చెప్తూ ప్రత్యర్థుల్ని దారుణంగా వేధిస్తున్నారు. కడప, అనంతపురం, నెల్లూరు, గుంటూరు, విశాఖల్లోనూ దుర్మాగాలు ఇలాగే ఉన్నాయి.

స్థానిక ఎన్నికలను ఎంతో పకడ్బందీగా నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఘర్షణలను ఎందుకు ఆపలేకపోయింది. పోలీసులతో సమన్వయం చేసుకుంటూ భద్రత ఎందుకు కల్పించలేకపోయింది. ఇప్పుడీ ప్రశ్నలకు సమాధానం చెప్పేవాళ్లే లేరు. మెజార్టీ చోట్లలో పోలీసు యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. మరికొన్ని చోట్ల పోలీసుల తోడ్పాటుతోనే దౌర్జన్యాలు జరిగిన ఘటనలూ ఉన్నాయి. మొత్తంగా వైసీపీ గుప్పెట్లో అధికార యంత్రాంగం ఉండిపోవడం కలవరానికి గురి చేస్తోంది.

అసలు నామినేషన్లు అడ్డుకోవడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కాదా? ప్రజాస్వామ్యంలో పోటీ చేసేందుకు అందరికీ సమాన అవకాశాలు ఉండవా? చట్టం అధికార పార్టీకి ప్రత్యేక అధికారాలు ఇచ్చిందా? ప్రత్యర్థుల్ని అడ్డుకున్న చోట్ల, నామినేషన్‌ పత్రాలు చించేసిన ఘటనలు జరిగినచోట్ల EC ఎన్నికలను ఎందుకు వాయిదా వేయడం లేదు. ఇప్పుడిలా ఎన్నో ప్రశ్నలు. రాష్ట్రంలో వరుసగా జరిగిన ఘటనల్ని ఎన్నికల సంఘం సుమోటోగా తీసుకోవాలన్న డిమాండ్ కూడా ఉంది. ఐతే.. ఘర్షణలు, అధిరాకపక్షం దౌర్జన్యాలపై ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా EC కానీ, పోలీసు ఉన్నతాధికారులు కానీ తమ మొర ఆలకించడం లేదన్నది విపక్షాల మాట. ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగం పూర్తిగా ఒత్తిడిలో ఉన్నాయని వారంటున్నారు. గురువారం నామినేషన్ల పరిశీలనలోనూ అక్రమాలు జరిగే అవకాశం ఉందని విపక్షాలు భయపడుతున్నాయి. ఉప సంహరణల కోసం కూడా బెదిరంపులు మొదలవడం బట్టి చూస్తే.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్టుగానే రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నట్టు కనిపిస్తోంది.

Next Story

RELATED STORIES