జనతా కర్ఫ్యూకి స్వచ్ఛందంగా సిద్ధమవుతున్న భారత్

జనతా కర్ఫ్యూకి స్వచ్ఛందంగా సిద్ధమవుతున్న భారత్

ప్రపంచాన్ని వణికిస్తున్నకరోనా భూతంపై యుద్ధం ప్రకటించేందుకు యావత్ దేశం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూని పాటించేందుకు జనమంతా స్వచ్చంధంగా సన్నద్ధం అవుతున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశం మొత్తం షట్‌డౌన్ కానుంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నాయి. ఆదివారం మొత్తం ప్రజలంతా ఇళ్లకే పరిమితం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు ఇళ్ల గుమ్మాల్లో నిలబడి సేవకులకు మనసారా చప్పట్లతో కృతజ్ఞతలు తెలుపనున్నారు. కరోనాపై పోరులో సంకల్పబలాన్ని చాటుదామన్న మోదీ పిలుపునకు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది.

దేశవ్యాప్తంగా ఆదివారం ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోనున్నాయి. ఉదయం 7 నుంచి రాత్రి 9 మధ్య ప్రారంభమయ్యే అన్ని రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ప్యాసింజర్‌ రైళ్లకు సంబంధించి 2,400 సర్వీసులు, దూర ప్రాంతాలకు తిరిగే 13 వందల ట్రైన్లు నిలిచిపోనున్నాయి. అటు అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో రిజర్వేషన్‌ కార్యాలయాలు, సాధారణ బుకింగ్‌ కేంద్రాలు, ఆటోమేటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషీన్‌లు, పార్శిల్‌ కార్యాలయాల వద్ద ఒకరికి ఒకరికి మధ్య మీటర్‌ దూరం ఉండేలా ఫ్లోర్‌పై మార్కింగ్‌ ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లలో డార్మిటరీలను మూసేయాలని రైల్వే నిర్ణయించింది. శనివారం రాత్రి 12 నుంచి ఏప్రిల్‌-15 రాత్రి 12 వరకు వీటిని మూసి ఉంచుతారు.

తెలంగాణ మొత్తం రేపు షట్‌డౌన్‌ కానుంది. 24 గంటలూ జనతా కర్ఫ్యూ పాటించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. అంటే ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు జనమంతా ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు..అటు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులతో పాటు..మెట్రో, MMTS సర్వీసులు నిలిచిపోనున్నాయి..కేవలం పరిమిత సంఖ్యలో MMTS సర్వీసులు నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా 12 సర్వీసులు మాత్రమే నడుపుతామని వెల్లడించారు. అలాగే రైల్వే స్టేషన్లలోని వెయిటింగ్‌ హాళ్లు, ఫుడ్‌ స్టాల్స్‌ను కూడా మూసివేయనున్నారు. కరోనా కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే ప్రయాణికులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.

ఏపీలో కూడా రేపు ఆర్టీసీ సేవలు నిలిచిపోనున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు బస్సు సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్టు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు అర్ధరాత్రి నుంచే ఆపేస్తారు. ప్రైయివేటు బస్సుల యాజమాన్యాలు కూడా సహకరించాలని మంత్రి కోరారు. ఆదివారం ఏపీ వ్యాప్తంగా పెట్రోలు బంకులు మూతపడనున్నాయి. ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు బంకులను మూసివేస్తున్నట్టు పెట్రో డీలర్ల సమాఖ్య ప్రకటించింది. అత్యవసర వాహనాలకే పెట్రోలు, డీజిల్‌ పంపిణీ చేస్తామని తెలిపింది. బంకుల్లో ఇద్దరు సిబ్బందే ఉంటారని స్పష్టం చేశారు.

ఆదివారం జనతా కర్ఫ్యూలో పాల్గొనేందుకు ప్రజలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. రైతుబజార్లు, సూపర్ మార్కెట్లలో రద్దీ కనిపిస్తోంది. రేపటికి అవసరమైన నిత్యావసరాలను ఇప్పుడే సిద్ధం చేసుకుంటున్నారు...దీంతో షాపులు, రైతు బజార్లు, పలు దుకాణాల వద్ద రద్దీ కనిపిస్తోంది. అటు వ్యాపారులు కూడా తాము స్వచ్చంధంగా జనతా కర్ఫ్యూలో పాల్గొంటామని చెబుతున్నారు. ఆదివారం రైతు బజార్లు, హోల్ సేల్ మార్కెట్లు అన్ని మూతపడనున్నాయి..

అటు సెలబ్రెటీలు కూడా జనతా కర్ఫ్యూపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. రజనీకాంత్‌, కమల్‌హాసన్, చిరంజీవి, మహేష్‌ బాబు, విజయ్‌, అజిత్‌, సూర్య, ధనుష్‌, విజయ్‌ సేతుపతి, శింబు తదితర స్టార్లంతా..సోషల్ మీడియాలో జనతా కర్ఫ్యూపై అవగాహన కల్పిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story