లాక్‌డౌన్ ఎత్తేస్తే శవాల దిబ్బగా భారత్

భారత్ లో రెండో దశ లాక్‌డౌన్ మే3 తో ముగుస్తుంది. అయితే.. మళ్లీ ఇది పొడిగిస్తారా? ఎత్తివేస్తారా అని సగటు భారతీయుడితో మెదులుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ఎత్తేస్తే కరోనా ప్రభావం ఎలా ఉంటుందో జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్, బెంగళూరు ఐఐఎస్, ఐఐటీ బాంబే సంస్థలు అంచనా వేస్తూ ఒక నివేదికను విడుదల చేశాయి.
లాక్‌డౌన్ ఎత్తేస్తే భారత్‌లో కరోనా మరణాలు ఊహకందని రీతిలో ఉండొచ్చని వారు హెచ్చరిస్తున్నారు. లక్షల సంఖ్యలో కరోనా కేసులు, వేల సంఖ్యలో కరోనా మరణాలు నమోదవుతాయని నివేదికలో తెలిపారు. దేశం శవాల దిబ్బగా మారుతుందని.. కరోనాను అదుపు చేయడం కష్టమవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మే 3న లాక్‌డౌన్ తొలగిస్తే మే 19 నాటికి 38,220 కరోనా మరణాలు, 5.35 లక్షల కేసులు నమోదు కావొచ్చని హెచ్చరిస్తున్నారు. ‘కొవిడ్-19 మెడ్ ఇన్వెంటరీ’ అనే సైంటిఫిక్ స్టాటిస్టికల్ మోడల్‌ను ఉపయోగించి ఈ అంచనాలను రూపొందించామని.. ఇదే ఉపయోగించి రూపొందించిన అంచనాలు ఇటలీ, న్యూయార్క్‌కు దాదాపు సరిపోలేలా ఉన్నాయని స్పష్టం చేశారు.
లాక్‌డౌన్ ఎత్తివేయాలి అనుకుంటే.. కేంద్రం ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలని అన్నారు. లాక్‌డౌన్ తీసివేసినా ప్రజలు కూడా స్వచ్ఛందంగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని, మాస్కులు ధరించకుండా బయటకు రాకూడదని, దీనివల్ల కొంత మేర వైరస్ వ్యాప్తిని నియంత్రించగలుగుతామని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com