భారత్‌లో 80శాతం కేసులు 30 ప్రాంతల్లోనే

భారత్‌లో 80శాతం కేసులు 30 ప్రాంతల్లోనే

కరోనా వైరస్‌ను అరికట్టడంలో భాగంగా దేశవ్యాప్తంగా 3వ దశ లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ 3వ లాక్‌డౌన్‌ నేటితో ముగియనుంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు 90 వేల 927 దాటిన పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ కొనసాగిస్తారా... లేదా అన్నది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే కొన్ని రోజుల క్రితం ప్రధాని మోదీతో దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంల వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశంలోనూ.. కరోనా వ్యాప్తిపై చాలా సీరియస్‌గా చర్చ జరిగింది. కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ పొడిగించాలనే అభిప్రాయం వ్యక్తమైంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 4 వేల 987 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గతంతో పోల్చితే ఒక్క రోజులో అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.

మే 31 వరకు బీహార్, ఝార్ఖండ్‌ రాష్ట్రాలు పొడిగించగా.. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కూడా.. లాక్‌డౌన్ పొడిగించాలని కోరుతున్నారు. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 80 శాతం కేసులు.. 30 మున్సిపాలిటీలు, కార్పొరషన్లలోనే బయటపడినట్టు తేలడంతో కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ 30 ప్రాంతాలు మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, రాజస్తాన్‌, ఉత్తరప్రదేశ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, ఒడిశా రాష్ట్రాల్లోనే ఉన్నాయి.

ఇక నాలుగవదశ లాక్‌డౌన్‌ గత మూడు లాక్‌డౌన్‌ల కంటే భిన్నంగా ఉండే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఆమేరకు కేంద్రం సూచనలు ఇచ్చింది. దీనిపై ఆదివారం కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేయనుంది. నాలుగోదశలో భాగంగా కంటైన్‌మెంట్‌ జోన్లలో మినహా రెడ్‌, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ఆటోలు, రిక్షాలు, బస్సులు, క్యాబ్‌లు తిరిగేందుకు కేంద్రం అనుమతిచ్చే అవకాశం ఉంది. కంటైన్‌మెంట్‌ జోన్లుకాని అన్ని జిల్లాల్లో అత్యవసరంకాని వస్తువుల సరఫరా, ఈ-కామర్స్‌ సంస్థలకు ఒకే చెప్పనుంది. ఆఫీస్‌లు, కర్మాగారాలకు మరింత సిబ్బందితో నడిపేందుకు వెసులుబాటు కల్పించే అవకాశాలున్నాయి. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాలకు పలు రైళ్లను నడుపుతుండగా... దేశీయ విమాన సర్వీసుల్ని కూడా నడిపే అవకాశాలున్నాయి.

కోవిడ్‌ రెడ్‌ జోన్ల నిర్వచననాన్ని కూడా.. కేంద్రం మార్చనుందని సమాచారం. కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు... లాక్‌డౌన్‌ సమయంలో 33 శాతం సిబ్బందితోనే ఫ్యాక్టరీలు ఉత్పత్తి, కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అయితే మరింత మంది సిబ్బందిని పనుల్లోకి తీసుకునే వెసులుబాటు కల్పించవచ్చు. దేశంలో జూన్‌, జులైలో మరింతగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని నిపుణులు ఓ వైపు హెచ్చరిస్తుండగానే కేంద్ర ఆంక్షలను క్రమక్రమంగా సడలిస్తూ ఉండటం గమనార్హం.

Tags

Read MoreRead Less
Next Story