భారత్‌లో కరోనా ప్రభావంపై ఆందోళనకరమైన అంచనాలు

భారత్‌లో కరోనా ప్రభావంపై ఆందోళనకరమైన అంచనాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారీ విజృంభిస్తోంది. ఇక మన దేశంలోనూ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే మనదేశం చైనాను దాటేసింది. ప్రస్తుతం 90 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరో రెండ్రోజుల్లో కేసుల సంఖ్య లక్ష దాటనుంది. కొత్త కేసుల విషయంలో భారత్ ప్రపంచంలోనే టాప్-5లో దేశాల్లో ఉంది. మే 2 నుంచి కొనసాగుతోన్న పరిస్థితిని బట్టి మనం మరో స్థానానికి ఎగబాకినా ఆశ్యర్యపోనక్కర్లేదంటున్నారు నిపుణులు. కరోనా వైరస్ చైనాలోనే పుట్టడంతో ప్రారంభంలో కరోనా కేసులు తీవ్రత ఎక్కువగా ఉండేది. డిసెంబర్ నుంచి మార్చి వరకు కరోనాకేసులు వేలల్లో పెరిగాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. మనదేశంలో మాత్రం ఏప్రిల్, మే నెలల్లో కేసులు వేలల్లో పెరిగాయి. గత వారం నుంచి కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

గతేడాది నవంబర్‌లోనే కరోనా వైరస్ వుహన్‌లో విజృంభించినా.. దానిని గుర్తించి అధికారికంగా ప్రకటించాడనికి చైనా చాలా సమయం తీసుకుంది. 2019, డిసెంబర్ 31న తమ దేశంలో తొలి కేసుల నమోదైనట్టు చైనా అధికారికంగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలిపింది. కచ్చితంగా నెల రోజుల తర్వాత మన దేశంలో తొలి కరోనా కేసు రిపోర్టయ్యింది. వుహాన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్ధులకు కరోనా ఉన్నట్లు కేరళ ప్రభుత్వం జనవరి 30న ప్రకటించింది. చైనాలో మొదటి మరణం జనవరి 9న నమోదైతే.. మార్చి 11న మనదేశంలో కరోనాతో తొలి పేషెంట్ చనిపోయారు. ఇప్పటి వరకు చైనాలో 82వేల 933 కేసులు నమోదైతే.. మన దేశంలో ఈ రోజు వరకు 90,398 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే చైనాను దాటేసిన ఇండియా.. మరో రెండ్రోజుల్లో లక్ష కేసులకు చేరుకోనుంది.

ఇక లాక్డౌన్‌ అంశంలో ఇరుదేశాలతో పోలిస్తే... వూహాన్‌లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో జనవరి 23న ఆ నగరాన్ని పూర్తిగా లాక్‌డౌన్ చేశారు. అయినా జనవరి నుంచి మార్చ్ వరకు చైనాలో కరోనా మారణహోమం సృష్టించింది. రోజురోజుకూ కేసుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతూ పోయాయి. మార్చి మూడో వారం నాటికి కరోనాను కాస్త కట్టడి చేయగలిగారు. అయినప్పటికీ లాక్‌డౌన్ ఆంక్షలు సడలించలేదు. దాదాపు 76 రోజుల తర్వాత వూహాన్‌కు రిలీఫ్ లభించింది. మనదేశంలో మార్చి 24న లాక్‌ డౌన్‌ అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం మూడో విడత లాక్‌డౌన్‌ పూర్తి కానుంది. నాలుగో విడుత‌ కూడా కొనసాగే అవకాశాలున్నాయి. లాక్‌డౌన్‌తో కరోనా కేసుల సంఖ్యను భారీగా తగ్గించకున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ఇక.. ఇప్పటి వరకు చైనాలో 4వేల 633 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోతే.. మన దేశంలో 2వేల 862 మంది చనిపోయారు. చైనాలో ప్రతి పది లక్షల మందిలో 58మందికి కరోనా వస్తే.. అదే మనదేశంలో 60మందికి సోకింది. మరణాల్లో మాత్రం చైనానే ముందుంది. చైనాలో పది లక్షల మందిలో ముగ్గురు కరోనాతో చనిపోతే.. మనదేశంలో ఇద్దరు మాత్రమే ప్రాణాలుకోల్పోతున్నారు. ప్రస్తుతం 3 నుంచి 4 వేలకుపైగా రోజు కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 21 లక్షల మందికి పరీక్షలు చేశారు. టెస్టులు పెరిగితే కేసుల సంఖ్య కూడా భారీగా పెరగనుంది. ఇది ఇలాగే కొనసాగితే.. దేశంలో కరోనా కేసులు జూన్, జులైలో పీక్ స్టేజ్ కు చేరుతాయి.

కొత్త కేసుల్లో టాప్ ఫైవ్ దేశాల్లో ఉన్న భారత్.. మొత్తం కేసుల విషయంలోనూ చైనాను వెనక్కినెట్టేసింది. ప్రస్తుతం 11వ స్థానంలో ఉండగా.. టాప్ టెన్ లో చేరడానికి రెడీగా ఉంది. దేశంలో కరోనా విజృంభన ఇలాగే వ్యాప్తి విస్తరిస్తే, భారత్‌లో త్వరలోనే ప్రపంచంలో అగ్రస్థానంలోకి వెళ్లినా ఆశ్యర్యపోనక్కర్లేదంటున్నారు నిపుణులు.

Tags

Read MoreRead Less
Next Story