Andhra Pradesh : ఏపీలో కొత్త జిల్లాల పాలనకు శ్రీకారం.. బాధ్యతలు స్వీకరించనున్న కలెక్టర్లు, ఎస్పీలు

Andhra Pradesh : ఏపీలో కొత్త జిల్లాల పాలనకు శ్రీకారం.. బాధ్యతలు స్వీకరించనున్న కలెక్టర్లు, ఎస్పీలు
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్విభజించారు.

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్విభజించారు. ఆగమశాస్త్ర పండితులు సూచించిన ముహూర్తం ప్రకారం.. సరిగ్గా 9 గంటల 5 నిమిషా నుంచి 9 గంటల 45 నిమిషాల మధ్య సీఎం జగన్ కొత్త జిల్లాలను లాంఛనంగా ప్రారంభించారు. కొత్తగా ఏర్పాటు చేసిన 23 రెవెన్యూ డివిజన్లతో కలిపి మొత్తం 73 రెవెన్యూ డివిజన్లు పనిచేయడం ప్రారంభించాయి. కొత్త జిల్లాల కలెక్టర్లు, జిల్లా జాయింట్‌ కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు, జిల్లా రెవెన్యూ అధికారులు, ఆర్డీవోలు బాధ్యతలు స్వీకరించారు. ఉద్యోగుల కేటాయింపు కూడా పూర్తవడంతో.. దానికి అనుగుణంగా అధికారులు కూడా బాధ్యతలు చేపట్టారు.

42 ఏళ్ల తరువాత ఏపీలో కొత్త జిల్లాలు పుట్టుకొచ్చాయి. ఒక్కో జిల్లాలో 18 లక్షల నుంచి 23 లక్షల జనాభా ఉండేలా ప్లాన్ చేశారు. విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్‌ పేరుమీద ఎన్టీఆర్‌ జిల్లా తీసుకొచ్చారు. తాళ్లపాక అన్నమయ్య పేరుతో రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా, పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయిబాబా పేరుతో శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటుచేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రకాశం జిల్లా అత్యంత పెద్ద జిల్లాగా అవతరించింది. 14వేల 322 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో రాష్ట్రంలోనే పెద్ద జిల్లాగా మారింది. విశాఖపట్నం అత్యంత చిన్నజిల్లాగా మారింది.

విశాఖపట్నం తరువాత అతి చిన్న జిల్లాలుగా కోనసీమ, పశ్చిమగోదావరి, గుంటూరు, తూర్పుగోదావరి, కాకినాడ ఉన్నాయి. ఈ 6 జిల్లాల మొత్తం విస్తీర్ణాన్ని కలిపినా ప్రకాశం జిల్లా కంటే తక్కువే ఉన్నాయి. ప్రకాశం తర్వాత అల్లూరి సీతారామరాజు, కడప జిల్లాలు విస్తీర్ణం పరంగా పెద్ద జిల్లాలుగా మారాయి. రాష్ట్రం మొత్తం విస్తీర్ణంలో ఈ మూడు జిల్లాలే 23.19 శాతం ఆక్రమించాయి. ఇక అధిక జనాభా, మండలాలు కలిగిన జిల్లాగా నెల్లూరుకు ఫస్ట్ ప్లేస్ దక్కింది. ప్రకాశం జిల్లా రెండో స్థానంలో ఉంది. ఆ తరువాత కర్నూలు, అనంతపురం, ఎన్టీఆర్‌ జిల్లాలు జనాభా పరంగా ముందున్నాయి. రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 23 శాతం ఈ ఐదు జిల్లాల్లోనే ఉన్నారు.

ఉత్తరాంధ్ర కింద ఇప్పటి వరకు మూడు జిల్లాలే ఉండేవి. ఇప్పుడవి ఆరు జిల్లాలయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు కొత్తగా పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు వచ్చాయి. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం, దూరం దృష్ట్యా అరకు పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని రెండు ప్రత్యేక జిల్లాలుగా విభజించారు. పునర్విభజనతో కోస్తాంధ్ర 12 జిల్లాలుగా మారింది. తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో పాటు కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్‌, పల్నాడు, బాపట్ల జిల్లాలు పుట్టుకొచ్చాయి. ఇక రాయలసీమలోని నాలుగు జిల్లాలు 8 జిల్లాలుగా మారాయి. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరుతో పాటు నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాలు వచ్చి చేరాయి.

కొత్త జిల్లాల ఏర్పాటు కోసం లోక్‌సభ నియోజకవర్గాల సరిహద్దులనే దాదాపుగా పరిగణనలోకి తీసుకుంది ప్రభుత్వం. దీనిపై జనవరి 25న నోటిఫికేషన్‌ ఇచ్చింది. అయితే, కొత్త జిల్లాలపై సుమారు 17వేలకు పైగా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు వచ్చాయి. వాటిని పరిగణలోకి తీసుకున్నప్పటికీ.. ఎలాంటి మార్పుచేర్పులు లేకుండానే ప్రాథమిక నోటిఫికేషన్ ప్రకారమే ముందుకు వెళ్లింది. ఒక్క బాలాజీ జిల్లానే తిరుపతిగా ఫైనల్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

కొత్త జిల్లాల్లో 70 శాతం కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని చోట ప్రైవేట్‌ భవనాలు ఎంపిక చేశారు. కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కారణంగా కలెక్టర్‌, ఎస్పీ, ఆర్డీవో, ఇతర డివిజన్‌ స్థాయి అధికారుల పరిధులు తగ్గిపోయాయి. ప్రతి జిల్లాలో 70 వరకు ప్రభుత్వ శాఖలు, 120 కార్యాలయాలు ఉన్నాయి. కొత్త జిల్లాల్లో ముఖ్యమైన కార్యాలయాలు మాత్రమే నడుస్తాయి. సైనిక సంక్షేమం, ఉద్యానం తదితర తక్కువ సిబ్బంది ఉండే శాఖల ఉద్యోగులు పాత జిల్లాల్లోనే ఉంటారు.

Tags

Read MoreRead Less
Next Story