CDF: అక్రమ కేసులపై మహిళల ఆవేదన

CDF: అక్రమ కేసులపై మహిళల ఆవేదన
సిటిజన్స్‌ డెమోక్రసీ ఫోరం సమావేశంలో కన్నీటిపర్యంతం

వైసీపీ సర్కార్‌ పోలీసులను ఉపయోగించుకుని వేధిస్తుందంటూ సిటిజన్స్‌ డెమోక్రసీ ఫోరం సమావేశంలో బాధితులు వాపోయారు. అమరావతి కోసం పోరాడుతుంటే అక్రమ కేసులు బనాయించారంటూ రాజధాని మహిళలు ఆవేదన వెళ్లగక్కారు. బాధితుల రోదనను విన్న త్రిసభ్య కమిటీ సభ్యులు వ్యవస్థల్లో మార్పులు తీసుకొచ్చే దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు.. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థ పనితీరుపై సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించింది. సమావేశంలో పాల్గొన్న రాజధాని రైతులు, పలువురు బాధితులు కమిటీ ఎదుట తమపై బనాయించిన అక్రమ కేసుల గురించి వివరించారు. LG పాలిమర్స్‌ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినందుకు సీఐడీ అరెస్టు చేసి.... తన జీవితాన్ని దుర్భరం చేశారని బాధిత మహిళ రంగనాయకి ఆరోపించారు. అమరావతి కోసం పోరాడినందుకు తమపై చెప్పుకోలేని కేసులు పెట్టారని రాజధాని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.


రక్షణగా ఉండాల్సిన పోలీసులు భక్షకులుగా మారడం దురదృష్టకరమని సమావేశంలో పాల్గొన్న సీనియర్‌ న్యాయవాదులు, వివిధ పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. మాజీ DGP...MV భాస్కరరావు, మాజీ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ సత్యప్రసాద్, సీనియర్ పాత్రికేయులు వెంకటేశ్వర్లుతో కూడిన కమిటీ వివిధ ప్రాంతాల్లో పర్యటించి బాధితుల నుంచి వివరాలు సేకరిస్తుందని సిటిజన్స్ ఫర్‌ డెమోక్రసీ తెలిపింది.బాధితులకు న్యాయ సహాయం అందేలా చర్యలు చేపడతామని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని పోలీసు వ్యవస్థ ఒకటే కాదని అన్ని వ్యవస్థలు నిర్వీర్యంగా మారాయని మాజీ DGP MV భాస్కరరావు వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో దారుణమైన పాలన వ్యవస్థ చూడడం బాధాకరంగా ఉందని ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ’ త్రిసభ్య కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ‘రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నేతలు, కార్యకర్తలపై కేసులు’.. అంశంపై చర్చ కార్యక్రమం నిర్వహించారు. వైకాపా పాలనలో అక్రమ కేసులుతో ఎలా ఇబ్బందులు పెడుతున్నారో చెబుతూ.. అమరావతి మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు. ఇటీవలే ప్రభుత్వ నిధులు పార్టీ కార్యక్రమాలకు వినియోగించడం అనైతికమని సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ ఫోరం ప్రతినిధులు నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌, తదితరులు బుధవారం గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం రమేశ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. తమ విజ్ఞప్తిపై గవర్నర్‌ సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story