Andhra news: అంగన్వాడీలపై ‘ఎస్మా’ ప్రయోగించిన ప్రభుత్వం

Andhra news: అంగన్వాడీలపై ‘ఎస్మా’ ప్రయోగించిన ప్రభుత్వం
బెదిరేదిలేదన్న అంగన్ వాడీలు, సమస్యలు పరిష్కరించేదాకా సమ్మె ఆపబోమని వెల్లడి

అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. సమ్మెను నిషేధిస్తూ జీవో జారీ చేసింది. తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు కొన్ని వారాలుగా ఆందోళన తెలుపుతున్న విషయం తెలిసిందే. వారితో పలుసార్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. అంగన్వాడీలను అత్యవసర సేవల కిందకు తీసుకొస్తూ సర్కారు జీవో నంబరు2 జారీ చేసింది. ఆరు నెలల పాటు నిరసనలను నిషేధించింది. సమ్మె చేసిన కాలానికి వేతనంలో కోత విధిస్తున్నట్లు వివరించింది. అంగన్వాడీల వేతనంలోనూ ప్రభుత్వం రూ.3 వేల చొప్పున కోత విధించింది.

ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ జగన్ సర్కారు విడుదల చేసిన జీవోపై అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు మండిపడుతున్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు, న్యాయమైన తమ డిమాండ్లను సాధించుకునేంత వరకూ సమ్మె విరమించబోమని తేల్చిచెప్పారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడబోమని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీలు చేస్తున్న సమ్మె శనివారానికి 26 రోజులకు చేరుకుంది. జీతాల పెంపుతో పాటు గ్రాట్యూటీ కోసం వర్కర్లు, హెల్పర్లు పట్టుబడుతున్నారు.

విధి నిర్వహణలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. సమ్మెకు దిగిన అంగన్ వాడీలతో ప్రభుత్వం పలుమార్లు చర్చలు జరిపి పలు డిమాండ్లకు ఓకే చెప్పింది. అయితే, మిగతా డిమాండ్లకు ఆమోదం తెలపాలంటూ అంగన్ వాడీలు పట్టుబడుతున్నారు. ముఖ్యంగా జీతాల పెంపు, గ్రాట్యూటీ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు.

ఎస్మా అంటే ?

అత్యవసర సర్వీసుల్లో ఉండే ఉద్యోగులు విధులకు హాజరు కాకపోవడం, సర్వీసులకు విఘాతం కలిగించేలా సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగించే అధికారం సర్కారుకు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులపై ప్రయోగించే ఈ ఎస్మా చట్టం ఆరు నెలలపాటు అమల్లో ఉంటుంది. అంతేకాదు, ప్రభుత్వాం దాన్ని మరింత పొడిగించే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగుల సస్పెన్షన్‌తో పాటు డిస్మిస్‌, జరిమానా, జైలు శిక్ష విధించే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. ఎస్మాను ఉల్లంఘించే పనులు చేస్తే పోలీసులు వారంట్ లేకుండానే అరెస్టు చేయవచ్చు. సమ్మె చేసిన అత్యవసర సర్వీసులకు చెందిన ఉద్యోగులకు ఆరు నెలల జైలు శిక్ష విధించవచ్చు. వీరి సమ్మెకు సహకరించిన వారికి ఏడాది జైలు శిక్ష విధించే వెసులుబాటు ఈ చట్టంలో ఉంది. తాజాగా, ఏపీ ప్రభుత్వం అంగన్ వాడీలను అత్యవసర సర్వీసులలోకి చేర్చుతూ జీవో విడుదల చేసింది. 2013 జాతీయ ఆహార భద్రత చట్టంలోని సెక్షన్ 39 కింద అంగన్వాడీలు అత్యవసర సర్వీసుల కిందకు వస్తారని సర్కార్ పేర్కొంది.


Tags

Read MoreRead Less
Next Story