AP Debts: రూ.23 వేల కోట్ల అప్పు కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు..

AP Debts (tv5news.in)

AP Debts (tv5news.in)

AP Debts: అప్పు లేనిదే పూట గడవని పరిస్థితుల్లో 23 వేల కోట్లు ఎలా తెచ్చుకోవాలో తెలియక ఏపీ ప్రభుత్వం తలకిందులు అవుతోంది.

AP Debts: అప్పు లేనిదే పూట గడవని పరిస్థితుల్లో 23 వేల కోట్లు ఎలా తెచ్చుకోవాలో తెలియక ఏపీ ప్రభుత్వం తలకిందులు అవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం గట్టెక్కాలంటే మార్చి నెలాఖరు వరకూ 23 వేల కోట్లు ఉంటేనే కానీ సర్దుబాటు కాని పరిస్థితి ఉందని RBIకి వివరించింది. ఇందుకోసం.. రుణ సేకరణ ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది.

RBI దగ్గరున్న వివిధ రాష్ట్రాల క్రెడిట్ డిమాండ్‌ క్యాలెండర్‌ వివరాల ప్రకారం చూస్తే.. ఏపీకి జనవరిలో 5 వేల కోట్లు, ఫిబ్రవరిలో 11 వేల కోట్లు, మార్చిలో 7 వేల కోట్లు ఉంటే ఏదో ఒకటి చేసి పని నడిపించొచ్చన్నమాట. ఈ నేపథ్యంలో రాష్ట్రం కోరుతున్నట్టు అప్పు తీసుకోవడానికి కేంద్రం అనుమతి లభిస్తుందా.. ఓకే అంటే అది ఎంత ఉంటుంది అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

ఐతే.. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం స్పష్టం చేసిన లెక్కల ప్రకారం చూస్తే.. మార్చి 31 వరకూ గరిష్టంగా 8 వేల 368 కోట్లు అప్పు తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఏపీ అవసరాలు 23 వేల కోట్లపైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఆర్థిక శాఖ అధికారులు కేంద్రాన్ని ఎలా ఒప్పిస్తారు.. వారి ముందు ఎలాంటి విన్నపాలు ఉంచుతారు అనేది కూడా ఆసక్తికరంగానే మారింది.

RBI వేలంలో పాల్గొని అప్పులు తీసుకునేందుకు ఇంకా కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాలేదు. ఇటు చూస్తే అవసరాలు తన్నుకు వచ్చేస్తున్నాయ్. ఢిల్లీ నుంచి క్లియరెన్స్ లేనిదే సెక్యూరిటీస్ వేలంలో పాల్గొనే అవకాశం ఉండదు. ఇవన్నీ మేనేజ్ చేయడం ఆర్థికశాఖకు తలకుమించిన భారంగా మారుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 44 వేల కోట్ల రుణానికి అనుమతి ఉంటే డిసెంబర్‌ నెలాఖరు వరకూ 36 వేల కోట్లు తెచ్చేయడం, వాడేయడం కూడా అయిపోయింది.

మిగిలిన 8 వేల కోట్ల అప్పుతోపాటు అదనంగా కావాల్సిన మొత్తం కలిపి 23 వేల కోట్లు రుణాల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి నెలా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 10 నుంచి 11 వేల కోట్ల వరకూ ఉంటుంది. దీనికి అదనగంగా 6 నుంచి 8 వేల కోట్లు అప్పలు చేస్తే బొటాబొటీగా అవసరాలు తీరుతున్నాయి. ఇప్పుడు అదనపు అప్పుకు అనుమతుల్లేని పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభాన్ని గట్టెక్కడం కత్తమీదసాములాగే మారింది.

కొత్త ఏడాది.. జనవరి 1వ తారీఖు.. జీతం ఆలస్యం కాకుండా వస్తుందని ఎదురు చూసిన ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి కూడా నిరాశ తప్పలేదు. కొద్ది నెలలుగా లేటవుతున్నట్టే ఈసారి కూడా చాలా మందికి జీతాలు వాయిదా పడ్డాయి. అనూహ్యంగా సచివాలయ ఉద్యోగులు, HODలకు కూడా ఈసారి శాలరీ విషయంలో ఇబ్బంది ఎదురైందంటే ఖజానా ఎంత వెలవెలబోయి కనిపిస్తోందో అర్థం చేసుకోవచ్చు.

అప్పుల తిప్పలు ఎంత ఘోరంగా ఉన్నాయో చెప్పడానికి ఇదో ఉదాహరణ కూడా. నిజానికి ఈ ఇబ్బంది లేకుండా చూసేందుకే RBI వద్ద ODకి వెళ్లినట్టు కూడా తెలుస్తోంది. ఏప్రభుత్వమమైనా ఇలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు RBI వద్ద వేజ్ అండ్‌ మీన్స్‌ కిందో, స్పెషల్ డ్రాయల్ లిమిట్స్ కిందో, OD కిందో అప్పులు చేసి మేనేజ్ చేశాయి.

ఈసారి ODకి వెళ్లినా కానీ పూర్తిస్థాయిలో అవసరాలు గట్టెక్కలేదు. జనవరి నుంచి క్యాలెండర్ ఇయర్ ప్రకటించినట్టు వివిధ పథకాలకు కూడా వరుసగా నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. జీతాలకే కటకటలాడే పరిస్థితుల్లో వాటన్నింటినీ ఎలా నెరవేరుస్తారు.. ఏం చేస్తారు అనేది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలింది. ఇటు చూస్తే ఉద్యోగులు కొత్త PRC కోసం పట్టుబడుతున్నారు.

అన్ని వర్గాలకు అడిగినదానికంటే ఎక్కువే మేలు చేస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం.. తమ విషయంలో ఎందుకు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని ఉద్యోగ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. అడిగినంత మేర ఫిట్‌మెంట్ మాట అటుంచితే.. జీతాలే సక్రమంగా ఇవ్వలేని పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉద్యోగులంతా ఉన్నారు.

ఉద్యోగులే కాదు సామాజిక పెన్షన్ల విషయంలోనూ 2022 తొలి రోజే ఏపీ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంది. చాలా జిల్లాల్లో కొన్ని కారణాల కారణంగా పూర్తిస్థాయిలో వృద్ధులకు పెన్షన్లు అందలేదు. కొత్త ఏడాది, పైగా ఈ నెల నుంచి 2 వేల 500 పెన్షన్ వస్తుందని ఎదురు చూసిన వృద్ధులు.. సాయంత్రం వరకూ ఎదురు చూపులు చూసినా డబ్బులు మాత్రం అందలేదు.

పెంచిన పెన్షన్ 2500ను ఈనెల నుంచి అందిస్తున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సభలో CM దీన్ని ప్రారంభించాక.. వాలంటీర్లు గ్రామాల్లో పెన్షన్లు పంచడం మొదలుపెట్టారు. ఐతే.. కొన్ని చోట్ల బ్యాంక్‌ నుంచి డబ్బుల విత్‌డ్రా విషయంలో తలెత్తిన ఇబ్బందులతో పెన్షన్లు అందలేదు. ఇలా అప్పు తేవడం ఆలస్యం.. అలా పదిరకాల ఖర్చులు కళ్లముందు కనిపిస్తున్నాయి.

ఎటు సర్దుబాటు చేద్దామన్నా మిగతా వాటి విషయంలో తీవ్రమైన ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. మొన్నటి డిసెంబర్‌ 28న జరిగిందే తీసుకోండి. RBI దగ్గర సెక్యూరిటీలు వేలం వేసి 2 వేల 250 కోట్లు తెచ్చారు. హమ్మయ్య.. ఫస్ట్‌కి జీతాలు, పెన్షన్ల ఇబ్బందులైనా తప్పుతాయని భావిస్తే.. ఈ కష్టాలన్నీ అలాగే ఉన్నాయ్.. అటు చూస్తే తెచ్చిన డబ్బంతా ఖర్చైపోయింది.

జనవరి 6 నుంచి అమలు కావాల్సిన అమ్మ ఒడి వాయిదా వేసినా కానీ.. కనీస అవసరాలు గట్టెక్కలేని దుస్థితి. ఈ పరిస్థితుల్లో ఈ మూడు నెలలు ఎలా నడపాలి.. రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు 23 వేల కోట్లు అప్పు పుడుతుందా..? దీనికి రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు ఏం చేస్తారు.. వైకుంఠపాళీ ఆటలో పామునోట్లో పడినట్టు మరింతగా ఇబ్బందుల్లో కూరుకుపోవాల్సిందనా.. లేదంటే నిచ్చెన దొరికి తాత్కాలికంగా గండం గట్టెక్కే ఛాన్స్ ఉంటుందా.. వేచి చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story