AP: కొనసాగుతున్న అంగన్‌వాడీల ఆందోళన

AP: కొనసాగుతున్న అంగన్‌వాడీల ఆందోళన
18వరోజూ ఉద్ధృతంగా సమ్మె... వినూత్న రీతిలో నిరసనల

ఆంధ్రప్రదేశ్‌లో 18వ రోజూ అంగన్వాడీల సమ్మె ఉద్ధృతంగా సాగింది. రాష్ట్రమంతా నిరసన దీక్షలు నిర్వహించారు. చాలాచోట్ల వినూత్న రీతిలో ఆందోళన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్‌ ప్రభుత్వం దిగివచ్చే వరకు ఆందోళనలు విరమించేదే లేదని స్పష్టం చేశారు. తామేమి గొంతెమ్మ కోర్కెలు కోరడంలేదని.... గతంలో జగన్ ఇచ్చిన హామీలనే నెరవేర్చమని అడుతున్నా.... పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో అంగన్వాడీ కార్యకర్తలు.... గడ్డి తింటూ నిరసన తెలిపారు. అల్లూరి జిల్లా రంపచోడవరంలోనూ.... మహిళలు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. సీఎం, మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేల పేర్లు రాసి... వారితో కబడ్డీ ఆడి నిరసన వ్యక్తం చేశారు. విశాఖ ఎంపీ M.V.V సత్యనారాయణ నివాసం ఎదుట అంగ్వాడీలు బైఠాయించి... ధర్నా చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని... నినాదాలు చేశారు. సత్యనారాయణ బయటకు వచ్చి వారి నుంచి వినతిపత్రం తీసుకుని వారికి సర్దిచెప్పే యత్నం చేశారు.


విజయవాడ ధర్నాచౌక్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో భారీ సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కారం పట్ల వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని మండిపడ్డారు. నందిగామ ఆర్డీవో కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద 18రోజులగా ధర్నా చేస్తున్నా మహిళా మంత్రులు కనీసం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. కర్నూలు-బళ్లారి ప్రధాన రహదారిపై ఒంటి కాలిపై నిలబడి దండం పెడుతూ.... అంగన్వాడీలు ఆందోళన చేశారు. ఒంగోలు కలెక్టరేట్‌ ఎదుట... అంగన్వాడీలు ధర్నా చేపట్టారు. నెల్లూరు జిల్లా కావలి ఆర్డీవో కార్యాలయం వద్ద ఆకులు తింటూ... నిరసన దీక్ష చేపట్టారు. అనంతపురంలోనూ.... వినూత్న నిరసన చేపట్టారు. చెడు వినకు... చెడు చూడకు అంటూ నల్ల చీరలతో ఉరితాళ్లు వేసుకొని ఆందోళన చేపట్టారు. మహిళల రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నా..... ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు.


మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పురపాలక కార్మికులు వినూత్న నిరసనలకు శ్రీకారం చుట్టారు. చాలీచాలని వేతనాలతో బతకలేమంటూ ఉరివేసుకున్నట్లు నిరసన తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయ వద్ద పెద్దఎత్తున ఆందోళన నిర్వహించిన మున్సిపల్ కార్మికులు....గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి నెరవేర్చకపోవడం వల్లే తాము సమ్మెలోకి వెళ్లాల్సి వచ్చిందన్న కార్మికులు....ఈసారి జగన్‌కు కచ్చితంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ మంగళగిరి నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. బాపట్ల జిల్లా చీరాలలో పురపాలక కార్యాలయం ఎదుట ఉరితాళ్లతో.... వినూత్న నిరసన తెలిపారు. NTR జిల్లా నందిగామలోనూ కార్మికులకు ఆందోళన చేపట్టారు.


Tags

Read MoreRead Less
Next Story