AP Liquor: ఏపీలో మద్య నిషేధం లేదు.. నియంత్రణ మాత్రమే..!

AP Liquor: ఏపీలో మద్య నిషేధం లేదు.. నియంత్రణ మాత్రమే..!
AP Liquor: భవిష్యత్‌లోని లిక్కర్‌ ఆదాయాన్ని చూపించి అప్పులు తెచ్చేసిన వైసీపీ ప్రభుత్వం.. నిషేధం మాటే మర్చిపోయింది.

AP Liquor: మాట తప్పారు. మడమ తిప్పారు. చెప్పాడంటే చేస్తాడంతే అని డబ్బాలు కొట్టుకున్న వాళ్లే.. ఇప్పుడు అడ్డంగా మాట మడతెట్టేశారు. మద్య నిషేధం విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎంతలా యూ-టర్న్‌ తీసుకుందో చూస్తే ఎవరైనా సరే అవాక్కవ్వాల్సిందే..! సీఎం జగన్ సహా వైసీపీ నేతలంతా పదేపదే చెప్పే నవరత్నాల్లో మద్య నిషేధం ఒకటి. కానీ ఆ రత్నం ఇప్పుడు రాలిపోయింది. అధికారికంగా ప్రభుత్వ ప్రకటనల్లోనే 'మద్య నిషేధం' హామీ ప్లేస్‌లో 'మద్య నియంత్రణ' అని కనిపిస్తోంది. ప్రతిపక్షాలు ఇప్పుడు దీన్నే హైలైట్‌ చేస్తున్నాయి.

భవిష్యత్‌లో వచ్చే లిక్కర్‌ ఆదాయాన్ని చూపించి వేల కోట్లు అప్పులు తెచ్చేసిన వైసీపీ ప్రభుత్వం.. చివరికి నిషేధం మాటే మర్చిపోయిందని విమర్శిస్తున్నాయి. 2019 ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో మద్య నిషేధంపై స్పష్టమైన హామీ ఇచ్చారు జగన్. కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోందని, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయని అందుకే నిషేధం తెస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యం నిషేధిస్తామన్నారు. మద్యాన్ని ఫైవ్‌స్టార్‌ హోటళ్లకే పరిమితం చేస్తామన్నారు. స్టార్ హోటళ్లకే పరిమితం అంటే మద్యం నిషేధం అన్నమాటే.

అధికారంలోకి వచ్చాక కొత్త లిక్కర్‌ పాలసీ తీసుకొచ్చారు. గతంతో పోలిస్తే 1200 షాపుల వరకూ తగ్గించినా.. మద్యాన్ని మాత్రం ప్రధాన ఆదాయ వనరుగానే చూసింది ప్రభుత్వం. 2021-22 ఏడాదిలో ఖజానాకు మద్యం ద్వారా వచ్చిన ఆదాయమే దాదాపు 19 వేల కోట్లు ఉందంటే లిక్కర్‌ కిక్కు ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు రేట్లు పెంచుకుంటూ పోతున్నారు కాబట్టి భవిష్యత్‌లో ఈ ఆదాయం ఇంకా పెరగొచ్చు. అధికారంలోకి రావడానికి అలవికాని హామీలిచ్చిన YCP.. ఇప్పుడు వాటి అమలుకు మద్యాన్నే నమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

అమ్మఒడి మొదలు ఎన్నో పథకాలకు ఇప్పుడు ఈ లిక్కర్‌ సేల్స్‌పై వచ్చే ఆదాయమే కీలకం అయ్యింది. అందుకే.. నాడు మధ్యనిషేధం అని ఆర్భాటంగా ప్రకటనలు చేసి.. ఇప్పుడు నియంత్రణ అంటూ రూటు మార్చాల్సి వచ్చింది. నవరత్నాలు లోగోలో మద్య నిషేధం బదులు నియంత్రణ అనడంలోనే 2019లో ఇచ్చిన హామీపై 2022కి వచ్చేసరికి అమలు సాధ్యం కాదంటూ చేతులు ఎత్తేశారనే విమర్శలు వస్తున్నా.. వైసీపీ నేతలు మాత్రం నియంత్రణ పల్లవే ఆలపిస్తున్నారు. దశలవారీగా నిషేధిస్తామనే చెప్పామని అంటున్నారు. అలా నిషేధించే దశ ఎప్పుడు వస్తుందంటే మాత్రం మాట పెగలడం లేదు.

నాడు ఎన్నికల సభల్లోను, ప్రెస్‌మీట్‌లలోను జగన్ పదే పదే మద్య నిషేధం అనేవారు. అది కూడా చాలా ఫోర్స్‌గా చెప్పేవారు. ఆ మాటలు ఓసారి చూద్దాం. వైసీపీ అధికారంలోకి వచ్చాక మద్య నిషేధం అమల్లో భాగంగా అంటూ రేట్లను విపరీతంగా పెంచారు. 33 శాతం షాపుల్ని తగ్గించడం, రేట్లు పెంచడం వల్ల తాగడం తగ్గుతుందని చెప్పారు. కానీ.. ఆదాయం చూస్తే అంతకు మించే ఉంది తప్ప తేడా లేదు. పైగా మద్యం అధికార ధరల కారణంగా సారాయి మళ్లీ పల్లెల్లో విచ్చలవిడిగా దొరకడం మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో నిషేధంపై మరింత కఠినంగా ఉండాల్సిన ప్రభుత్వం.. నియంత్రణ పాట అందుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story