AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల పాలన అప్పటినుండే..

AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల పాలన అప్పటినుండే..
AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది.

AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందుకు తుది నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. కొత్త జిల్లాల ఏర్పాటు, అధికారుల విధులపై మంత్రులు, ప్లానింగ్, రెవెన్యూ, హోంశాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు.

కొత్త జిల్లాల ఏర్పాటుపై వస్తున్న అభ్యంతరాలు, ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలపైనా చర్చించారు. ఉగాది నుంచే కొత్త జిల్లాల్లో పాలన నిర్వహించాలని, ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలనే కొత్త జిల్లాలకు పంపాలని సీఎం జగన్ ఆదేశించారు. పరిపాలన సాఫీగా సాగడానికి ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీల అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందని సీఎం జగన్ అన్నారు.

కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచే పాలన కొనసాగుతుందని తెలిపారు. ఉగాది లోపు భవనాలు, మౌలిక వసతులు, ఉద్యోగుల విభజన.. అన్నీ పూర్తి కావాలన్నారు. కొత్త భవనాల నిర్మాణానికి ప్రణాళికలు ఖరారు చేయాలని, భవనాల స్థలాల గుర్తింపుపై దృష్టి పెట్టాలని సూచించారు. కొత్త జిల్లాల ప్రతిపాదనలు, ప్రాతిపదికలను అధికారులకు తెలిపిన ముఖ్యమంత్రి.. కొత్త జిల్లాల మ్యాపులు, జిల్లా కేంద్రాల నిర్ణయం వెనుక తీసుకున్న ప్రాధాన్యతలను వివరించారు.

ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను పునర్‌వ్యవస్థీకరణ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుపై నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ గత నెల 25న నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తూ చర్యలు చేపట్టింది. కొత్తగా మన్యం, అల్లూరి సీతారామారాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్‌, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, శ్రీ బాలజీ జిల్లాలుగా ప్రతిపాదించారు.

కొత్త జిల్లాలతో పాటు కొత్తగా మరో 15 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసింది. అయితే.. కొత్త జిల్లాల ఏర్పాటుపై పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కాగా.. నోటిఫికేషన్‌ జారీ చేసిన 30 రోజుల్లోగా జిల్లాల ఏర్పాటుపై వచ్చిన అభ్యంతరాలు, సూచనలు, సలహాలను ప్రభుత్వం పరిశీలించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఎవరైనా తమ అభిప్రాయాలు చెప్పొచ్చని ప్రభుత్వం స్పష్టంచేసింది.

Tags

Read MoreRead Less
Next Story