ఆంధ్రప్రదేశ్

AP New Districts : ఏపీలో ఇక పై 26 జిల్లాలు.. కొత్త జిల్లాలు ఇవే..!

AP New Districts : ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది జగన్ ప్రభుత్వం.

AP New Districts : ఏపీలో ఇక పై 26 జిల్లాలు.. కొత్త జిల్లాలు ఇవే..!
X

AP New Districts : ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది జగన్ ప్రభుత్వం. 26 జిల్లాలతో గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం.. ప్రజలు, ప్రజా సంఘాల నుంచి ప్రజాభిప్రాయం కోరుతోంది. ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఎవరైనా తమ అభిప్రాయాలు చెప్పొచ్చని తెలిపింది. వచ్చే ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలుకాబోతోందని ప్రభుత్వం ప్రకటించింది. 18 లక్షల నుంచి 20 లక్షల జనాభాతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. కొత్త జిల్లాలతో పాటు కొత్తగా మరో 15 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసింది. ఏపీలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

ఇప్పుడున్న 13 జిల్లాలతో పాటు కొత్తగా మరో 13 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. విశాఖ జిల్లాను విభజించి అనకాపల్లి జిల్లా, పార్వతీపురం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా ఏలూరు జిల్లా రాబోతోంది. కృష్ణా జిల్లాలోని నియోజకవర్గాలను విడదీసి ఎన్టీఆర్‌ జిల్లా ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు జిల్లా నుంచి భావపురి జిల్లా, పల్నాడు జిల్లాలు రాబోతున్నాయి. చిత్తూరు జిల్లాను విభజించి శ్రీ బాలాజీ జిల్లా, అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతి కేంద్రంగా కొత్తగా బాలాజీ జిల్లా ఏర్పాటు కాబోతోంది. కడప జిల్లాను రెండుగా విభజించి నంద్యాల జిల్లా ప్రతిపాదన తీసుకొచ్చారు. అనంతపురం జిల్లాలో ఇకపై శ్రీసత్యసాయి జిల్లా కూడా కనిపించబోతోంది.

దేశవ్యాప్తంగా జనాభా గణన పూర్తయ్యే వరకు కొత్త జిల్లాల ఏర్పాటు చేయొద్దని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. నిజానికి ఈపాటికే జనగణన మొదలవ్వాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఆలస్యమైంది. అయితే, దేశ జనగణన ప్రక్రియ ప్రారంభమయ్యేలోగా జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ పూర్తి చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. ఓవైపు కేంద్రం వద్దని చెబుతున్నా.. జగన్ ప్రభుత్వం ముందుకు వెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలు నడుస్తున్న కారణంగా.. ఆ ఇష్యూ నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలా నోటిఫికేషన్ ఇచ్చారన్న చర్చ నడుస్తోంది.

Next Story

RELATED STORIES