AP: ఏపీలో మొత్తం ఓట్లు 4 కోట్ల 8 లక్షల 7 వేల 256

AP: ఏపీలో మొత్తం ఓట్లు 4 కోట్ల 8 లక్షల 7 వేల 256
తుది జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం.... కొత్తగా ల22 లక్షల 38 వేల ఓట్లు...

ఆంధ్రప్రదేశ్‌లో ఓటరు ముసాయిదా జాబితా ప్రకటించిన 3నెలలకు ఎన్నికల సంఘం.. తుది జాబితాను విడుదల చేసింది. ముసాయిదాలో అక్రమాలు, అవకతవకాలు జరిగాయని విపక్షాలు ఫిర్యాదులు చేయడంతో ప్రత్యేక సమగ్ర విచారణ చేపట్టి తుది జాబితాను వెల్లడించింది. కొత్తగా 22 లక్షల 38 వేల మందిని ఓటర్లను జాబితాలో చేర్చగా...16 లక్షల 52 వేల మందిని తొలగించింది. ఏపీలో సుదీర్ఘ కసరత్తు అనంతరం ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితా ప్రకటించింది. గతేడాది అక్టోబరు 27న విడుదల చేసిన ముసాయిదా జాబితాలో 4 కోట్ల 2 లక్షల 21 వేల 450 మంది ఓటర్లు ఉండగా ప్రత్యేక సమగ్ర సవరణ తర్వాత ఆ సంఖ్య 4 కోట్ల 8 లక్షల 7 వేల 256కు పెరిగిందని.. ఈసీ వెల్లడించింది. వీరిలో పురుష ఓటర్లు 2 కోట్ల 74 వేల 322, మహిళలు 2 కోట్ల 7 లక్షల 29 వేల 452, థర్డ్‌ జెండర్స్‌ 3వేల482 మంది ఉన్నారు.


మొత్తం ఓటర్లలో సాధారణ ఓటర్లు 4 కోట్ల 7 లక్షల 39 వేల 822,.. N.R.I ఓటర్లు 7,603, సర్వీసు ఓటర్లు 67 వేల 434 ఉంది ఉన్నారు. తుది జాబితాలో 18 నుంచి 19 ఏళ్ల వయసున్న యువ ఓటర్లు 8 లక్షల 13 వేల 544 మంది నమోదయ్యారు. ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో నికరంగా 5 లక్షల 86 వేల 530 మంది ఓటర్లు పెరిగారు. కొత్తగా 22 లక్షల 38 వేల 952 మంది ఓటర్లుగా చేరారు. కొత్తగా చేరిన ఓటర్లలో పురుషులు 10 లక్షల 78 వేల 275మంది, మహిళలు 11 లక్షల 60 వేల 486 మంది, థర్డ్‌జెండర్‌ 191 మంది ఉన్నారు. మొత్తం 16 లక్షల 52 వేల 422 ఓటర్లను తొలగించారు. తొలగించిన వారిలో పురుషులు 8 లక్షల 35 వేల 013 మంది, మహిళలు 8 లక్షల 16 వేల 892 మంది, థర్డ్‌జెండర్‌ 517 మంది ఉన్నారు. వీరిలో మృతులు 5 లక్షల 84 వేల 810, వలస వెళ్లిన వారు 8 లక్షల 47 వేల 421 మంది, డూప్లికేట్‌ ఓట్లు 2 లక్షల 20 వేల 191 ఉన్నాయి.


మొత్తంగా ఓటర్ల నికర పెరుగుదల 1.46 శాతంగా ఉంది. తుదిజాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో పురుషుల కన్నా మహిళా ఓటర్లు 6 లక్షల 55 వేల 130 మంది అధికంగా ఉన్నారు. ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 25 జిల్లాల్లో పెరగ్గా.. ఒక్క నెల్లూరు జిల్లాలోనే స్వల్పంగా తగ్గింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 45,403 మంది ఓటర్లు పెరిగారు. నెల్లూరు జిల్లాలో 2వేల934 మంది తగ్గారు. 20 లక్షల 16 వేల 396 మంది ఓటర్లతో రాష్ట్రంలో అత్యధిక ఓటర్లున్నా జిల్లాగా కర్నూలు మొదటి స్థానంలో నిలిచింది. 7 లక్షల 61 వేల 538 మందితో అతితక్కువ ఓటర్లు కలిగిన జిల్లాగా అల్లూరి జిల్లా తొలిస్థానంలో నిలిచింది. శ్రీకాకుళం, ప్రకాశం మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 2023 జనవరి 5 నాటికి రాష్ట్రంలో 45,951 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 46,165కు పెరిగింది. ప్రత్యేక సమగ్ర సవరణ-2024లో భాగంగా 214 పోలింగ్‌ కేంద్రాలు పెరిగాయి. ఒక్కో పోలింగ్‌ కేంద్రం పరిధిలో గరిష్ఠంగా 1,500 ఓట్లు ఉంచారు.

Tags

Read MoreRead Less
Next Story