YS JAGAN: జగన్‌ సర్కారుకు కేంద్రం షాక్‌..

YS JAGAN: జగన్‌ సర్కారుకు కేంద్రం షాక్‌..
అమరావతిలో బయటి ప్రాంతాలకు చెందిన 47 వేల మందికి మందికి ఇళ్లు ఇవ్వాలన్న జగన్‌ సర్కారుకు కేంద్రం షాక్‌ ఇచ్చింది.

అమరావతిలో బయటి ప్రాంతాలకు చెందిన 47 వేల మందికి మందికి ఇళ్లు ఇవ్వాలన్న జగన్‌ సర్కారుకు కేంద్రం షాక్‌ ఇచ్చింది. ఈ ఇళ్ల నిర్మాణానికి నిధుల్ని కోర్టు కేసు తేలాకే ఇస్తామని స్పష్టంచేసింది. అమరావతిలో బయటి ప్రాంతాల వాళ్లకు ఇళ్లు ఇచ్చేందుకు జగన్‌ సర్కారు ఆఘమేఘాలపై చర్యలు తీసుకుంటోంది. తాజాగా కేంద్రం ఇచ్చిన ఈ షాక్‌ జగన్‌ దూకుడుకు ఎదురుదెబ్బ పడినట్లేనంటున్నారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో గతంలో కేటాయించిన దాదాపు 47 వేల ఇళ్లను రద్దు చేసి,వాటికి బదులుగా అమరావితిలో పీఏంఏవై-అర్బన్‌ కింద ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించింది.గత నెల 26న జరిగిన సెంట్రల్‌ శాంక్షనింగ్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ 67వ సమావేశం సైతం దీనికి ఆమోదం తెలిపింది. అయితే కోర్టు కేసులు తేలాక ఈ ఇళ్ల నిర్మాణానికి నిధులిస్తామని షరతు పెట్టింది. అంతేకాదు ఈ పథకం గడువు ముగిసేలోగా కోర్టు కేసులు పరిష్కారమైతేనే నిధులిస్తామని స్పష్టం చేసింది.లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఖర్చుతో ఇళ్లు నిర్మించాల్సి వస్తుందని తాజాగా విడుదల చేసిన సీఎస్‌ఎంసీ సమావేశం మినిట్స్‌లో కేంద్రం స్పష్టంచేసింది.

అమరావతిలో బయటి ప్రాంతాలకు వాళ్లకు ఇళ్లు ఇచ్చేందుకు జగన్‌ సర్కారు సీఆర్‌డీఏ చట్టాన్ని సవరించి,మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేసి మరీ ఆర్‌ 5 జోన్‌ను సృష్టించింది.విజయవాడ,పెదకాకాని, దుగ్గిరాల, మంగళగిరి వంటి ప్రాంతాలకు చెందిన 47వేల మందికి రాజధానిలో పట్టాలిచ్చింది.దీనిపై కొందరు హైకోర్టును, ఆపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తుది తీర్పునకు లోబడే... ఆ స్థలాలపై పట్టాదారులకు హక్కు వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఇచ్చిన పట్టాల్లోనూ ప్రస్తావించింది. కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ అక్కడ ఇళ్ల నిర్మాణానికి శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని వేరే ప్రాంతాల్లో మంజూరు చేసిన ఇళ్లను రద్దు చేసి, రాజధానిలో ఇళ్ల నిర్మాణానికి అనుమతివ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆ ఇళ్ల నిర్మాణానికి మొదట కేంద్రం నిధులు విడుదల చేయాలని, ఒక వేళ కోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే కేంద్రం ఇచ్చిన నిధుల్ని తిరిగి ఇచ్చేస్తామని రాష్ట్రం తెలిపింది. దానికి కేంద్రం అంగీకరించలేదు. కోర్టు కేసులు పరిష్కారమయ్యాకే నిధులు విడుదల చేస్తామని, ప్రస్తుతానికి ఇళ్లను మంజూరు చేస్తామని స్పష్టంచేసింది.

ఓ వైపు కేంద్రం ఇలాంటి షరతులు విధిస్తే అటు హైకోర్టులోనూ ఈ అంశంపై విచారణ జరిగింది.అమరావతిలో ఆర్‌5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందా లేక ఇళ్ల పట్టాల పంపిణీ వరకే అనుమతించిందా ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని జగన్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.ఈ భూముల్లో ప్రభుత్వం ఇళ్లు కట్టబోతోందా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరింది.ప్రతివాదులుగా ఉన్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ సెక్రెటరీ, పురపాలక, రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఏపీ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కమిషనర్‌, ఏపీసీఆర్డీఏ కమిషనర్‌, గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది.విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది.అమరావతి నిర్మాణం కోసం సమీకరించిన భూముల్లో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆర్‌ 5 జోన్‌ ఏర్పాటును సవాల్‌ చేస్తూ ఫార్మర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్ల హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. సీఆర్డీఏ సవరణ చట్టం హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుతోపాటు సీఆర్డీఏ చట్టం, ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం నిబంధలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ జీవోని రద్దు చేయాలని అభ్యర్థించారు.

Tags

Read MoreRead Less
Next Story