ఒకే రోజు తిరుపతిలో చంద్రబాబు, జగన్ ఎన్నికల ప్రచారం

ఒకే రోజు తిరుపతిలో చంద్రబాబు, జగన్ ఎన్నికల ప్రచారం
టీడీపీ తన ప్రచారాన్ని ఉధృతం చేయడంతో.. జగన్ కూడా తన వ్యూహం మార్చుకున్నట్టు తెలుస్తోంది.

టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్‌ ఒకే రోజు తిరుపతిలో ప్రచారం చేయనున్నారు. ఈ ఇద్దరూ ఒకే రోజు ప్రచారం చేపట్టనుండడంతో తిరుపతిలో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. చంద్రబాబు షెడ్యూల్ మూడు రోజుల క్రితమే ఖరారైంది. ఏ రోజు ఎక్కడ ప్రచారం నిర్వహించాలన్న దానిపై ఇప్పటికే షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు చంద్రబాబు. రేపటి నుంచి వరుసగా ఎనిమిది రోజుల పాటు క్యాంపైన్ నిర్వహించనున్నారు. తిరుపతి లోక్‌సభ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వరుసగా ప్రచారం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఈనెల 14వ తేదీన తిరుపతిలో ప్రచారం చేయబోతున్నారు చంద్రబాబు. సరిగ్గా అదే రోజు సీఎం జగన్ కూడా తిరుపతి వస్తున్నారు. రేపు ఉదయం రేణిగుంట చేరుకోనున్న చంద్రబాబు.. తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. రేపు సాయంత్రం శ్రీకాళహస్తిలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. 9వ తేదీన నెల్లూరు జిల్లా సర్వేపల్లి, 10వ తేదీన సూళ్లూరుపేట, 11వ తేదీన వెంకటగిరి, 12వ తేదీన సత్యవేడు, 13న గూడూరు, 14న తిరుపతిలో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు చంద్రబాబు.

తిరుపతి ఉప ఎన్నికల్లో ఎవరెవరు ప్రచారం చేయాలన్నది టీడీపీ ముందుగానే ఫిక్స్ చేసుకుని, షెడ్యూల్ ప్రకారం వెళ్తున్నారు. అలాగే, వైసీపీ నేతలు కూడా ప్రచారం చేపడుతున్నారు. కాని, వారి షెడ్యూల్‌లో జగన్‌ ప్రచారం చేస్తారని ఎక్కడా లేదు. కాని, టీడీపీ దూకుడు చూసిన తరువాతే ఈ షెడ్యూల్ ఖరారైనట్టు తెలుస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితేం బాగోలేదన్న రిపోర్టులు రావడం, టీడీపీ తన ప్రచారాన్ని ఉధృతం చేయడంతో... జగన్ కూడా తన వ్యూహం మార్చుకున్నట్టు తెలుస్తోంది. తాను స్వయంగా రంగంలోకి దిగితే తప్ప పరిస్థితులు చక్కబడేలా లేవని భావిస్తున్నారు. అందుకే, చంద్రబాబు అదే రోజు అదే ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తారని తెలిసినప్పటికీ జగన్ వస్తున్నారు. వేరే ఆప్షన్‌ లేకనే తిరుపతిలో ఇలా ప్రచారం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.


Tags

Read MoreRead Less
Next Story