ఆయారాం, గయారాంలు టీడీపీకి అవసరం లేదు : చంద్రబాబు

ఆయారాం, గయారాంలు టీడీపీకి అవసరం లేదు : చంద్రబాబు

న్యాయ వ్యవస్థపైనే ఎదురుదాడా వైఎస్‌ జగన్‌ అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. న్యాయ వ్యవస్థపై బురదజల్లే కార్యక్రమం మొదలు పెట్టారని మండిపడ్డారు. ఒక తెలుగువాడు దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి అవుతుంటే జగన్‌ ఓర్వలేకపోతున్నారని ఫైరయ్యారు. గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ నేతలతో సమీక్షించిన చంద్రబాబు ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని.. విజయవాడ ఘటన శాంతిభద్రతల పరిస్థితికి నిదర్శమన్నారు.

వరదలకు పంట నష్టపోయిన రైతులను కనీసం పలకరించే నాథుడే లేడని చంద్రబాబు అన్నారు. అమరావతి ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు కట్టుబానిసలు కంటే హీనమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. గుండాలు, రౌడీలు, సైకోలు స్వైర విహారం చేస్తున్నారన్నారు. లేని చట్టానికి పోలీస్‌స్టేషన్లు, దానికి సమీక్షలంటూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. అదంతా ఫేక్‌.. ఫేక్‌ ముఖ్యమంత్రి.. ఫేక్‌ పార్టీ.. ఫేక్‌ పరిపాలనగా రాష్ట్రాన్ని మార్చారంటూ ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో రైతులను అప్పులపాలు చేశారన్నారు చంద్రబాబు. బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని.. భవనాల కార్మికులు ఉపాధి పోగొట్టారని చెప్పారు. దళితులపై దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులు, ముస్లిం మైనార్టీలను వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజల్ని కష్టాల్లోకి నెట్టారని విమర్శించారు చంద్రబాబు. ఇసుక మాఫియా, లిక్కర్‌ మాఫియా, మైనింగ్‌ మాఫియాలు పెగ్రేటిపోతున్నాయన్నారు. ఆయారాం, గయారాంలు టీడీపీకి అవసరం లేదన్న చంద్రబాబు.. అవకాశవాద రాజకీయాలతో కొందరు నాయకులు పార్టీని వదిలి వెళ్లినా.. కార్యకర్తలే టీడీపీకి కంచుకోట అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story