Chandrababu : మే నెల పింఛన్లు ఇళ్ల వద్దే ఇవ్వాలి- కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ

Chandrababu : మే నెల పింఛన్లు ఇళ్ల వద్దే ఇవ్వాలి- కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు  లేఖ
పంపిణీని ఎన్నికల సంఘం పర్యవేక్షించాలంటూ వినతి

మే నెలలలో జరగాల్సిన సామాజిక పింఛన్ల పంపిణీని లబ్ధిదారుల ఇళ్లవద్దే ఇచ్చేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అధికారపార్టీతో కుమ్మక్కైన కొందరు అధికారులు రాజకీయలబ్దికోసం ఏప్రిల్‌ నెల పింఛన్ల పంపిణీలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేశారని ఆయన వివరించారు. ఈసారి అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తిచేశారు.

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌కు చంద్రబాబు 16 పేజీల లేఖ రాశారు. ప్రభుత్వపరమైన ప్రయోజనాలను లబ్ధిదారులకు అందించేటప్పుడు వాలంటీర్లను దూరంపెట్టి... ఇతర సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 30న ఉత్తర్వులు జారీచేసిందని ఆయన గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఉత్తర్వులు, పెద్దసంఖ్యలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఎన్నికలసంఘం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించినప్పుడు పింఛన్లను లబ్ధిదారుల ఇళ్లవద్దే పంపిణీ చేయడం మంచిదని... అది సాధ్యమేనని జిల్లా కలెక్టర్లు చెప్పారన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. అందుకోసం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితోపాటు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం దివ్యాంగులకు మాత్రమే ఇంటివద్ద పింఛన్‌ పంపిణీచేసి మిగతా వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద అందించాలని ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. లబ్ధిదారులను ఇలా వేరుచేయకుండా అందరికీ ఇళ్లవద్దే అందించాలన్న తన విజ్ఞప్తిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు పెడచెవినపెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. ఏప్రిల్‌ నెల పింఛన్ల పంపిణీకి అవసరమైన డబ్బును ఏప్రిల్‌ 3న విడుదల చేశారన్న ఆయన లబ్ధిదారులను మండుటెండల్లో సచివాలయాలకు వచ్చేలా చేశారని ధ్వజమెత్తారు. ఈ ప్రక్రియలో 33 మంది చనిపోయినట్లు వార్తలొచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉదంతాన్ని అడ్డంపెట్టుకొని రాజకీయ పబ్బం గడుపుకోవడానికి సీఎం జగన్ చూస్తున్నారన్నారు. జగన్‌ కుటుంబం చేతుల్లో ఉన్న మీడియా సంస్థలు, వైకాపా సోషల్‌ మీడియా ఈ మొత్తం వ్యవహారానికి ఎన్నికల సంఘం, ప్రత్యర్థి రాజకీయపార్టీలే కారణమని విషప్రచారం చేస్తున్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం, వారితో చేతులు కలిపిన అధికారులు కలిసి మే నెల పింఛన్ల పంపిణీలోనూ ఇదేతరహా కుట్రకు తెరతీసేందుకు అవకాశాలున్నాయని చంద్రబాబు ఆక్షేపించారు. ఎండలు భరించలేనిస్థాయికి చేరిన ప్రస్తుత రోజుల్లో లబ్ధిదారులతో ఇలా వ్యవహరించడం అనాగరికమని వాపోయారు. వారిని గ్రామ, వార్డు సచివాలయాలకు రప్పించి గంటలతరబడి ఎండల్లో నిలబెడితే ప్రాణాలకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉందన్నారు. మే ఒకటో తేదీనే పింఛన్లను లబ్ధిదారులందరికీ వారి ఇళ్లవద్దే పంపిణీచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామస్థాయిలో పెద్దసంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నందున... రెండురోజుల్లో అందరికీ ఇళ్లవద్దే పింఛన్లు ఇవ్వొచ్చని సూచించారు. పింఛన్లు అందరికీ ఇళ్లవద్దే ఇస్తామని, ఎవ్వరూ బయటికి రావాల్సిన అవసరం లేదని.ప్రభుత్వం మీడియాలో విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఈ విషయంలో ఎన్నికలసంఘం జోక్యంచేసుకొని తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. మే నెల పింఛన్ల పంపిణీని కేంద్ర ఎన్నికలసంఘం పర్యవేక్షించి పేదల ప్రాణాలను కాపాడాలన్నారు. ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ఉత్తర్వులు జారీచేయాలని చంద్రబాబు లేఖలో విజ్ఞప్తిచేశారు. దీనికి సంబంధించిన లేఖను... తెలుగుదేశం సీనియర్ నేత కనకమేడల రవీంద్రకుమార్‌ దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి అందించారు.

Tags

Read MoreRead Less
Next Story