టీడీపీ సీనియర్‌ నేతలతో సమావేశమైన చంద్రబాబు..!

టీడీపీ సీనియర్‌ నేతలతో సమావేశమైన చంద్రబాబు..!
టీడీపీ సీనియర్‌ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు.

టీడీపీ సీనియర్‌ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులు, ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరోనా వల్ల కోట్లాది కుటుంబాల ఆదాయాలు తలకిందలు అయ్యాయన్నారు. వైద్య గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా కరోనా సమయంలోనూ పన్నులు పెంచారని ఫైరయ్యారు.. తెల్లరేషన్‌ కార్డుదారులందరికీ 10వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పంటల్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి బకాయిలను వెంటనే చెల్లించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

కరోనా బాధితుల డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, టీడీపీ అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. 2.3 లక్షల ఉద్యోగాల భర్తీపై జగన్‌ రెడ్డి హామీని అమలు చేయాలని నిరసన కార్యక్రమాలు చేపట్టిన యువతను అరెస్టు చేయడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. పోలవరం నిర్వాసితులకు పది లక్షల పరిహారం ఇస్తామన్న హామీపై ముఖ్యమంత్రి మడమ తిప్పడం ప్రజా వంచన కాదా అని ప్రశ్నించారు. టీడీపీ హయాలంలో చంద్రన్న బీమా 2.47 కోట్ల మందికి వర్తింపజేయగా.. దాన్ని జగన్‌ రెడ్డి ప్రభుత్వం 60 లక్షలకు కుదించిందన్నారు. సహజ మరణాలకు పరిహారం 2 లక్షల నుంచి లక్ష వరకు కుదిస్తూ ఆదివారం జీవో నంబర్‌ 7 విడుదల చేయడం మోసకారి సంక్షేమమన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చుంటే చంద్రన్న బీమా పదిలక్షలు వచ్చుండేవన్నారు చంద్రబాబు.

హామీ ప్రకారం పెన్షన్‌ మూడు వేలు ఇవ్వలేదని.. 45ఏళ్లకే ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్‌ ఇస్తామన్న హామీపై మడమ తిప్పారని మండిపడ్డారు. పెన్షన్‌ దారుల సంఖ్య తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నాలు మంచిది కాదన్నారు చంద్రబాబు. పెద్దాపుర రామేశ్వర మెట్టలో 823 ఎకరాల్లో పర్యావరణం విధ్వంసం చేసిన వైసీపీ ఇసుక మాఫియాపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. అమరావతిని నాశనం చేయడమంటే యువత భవితను నాశనం చేయడమేనన్నారు. సిమెంట్‌,ఇసుక ఇచ్చి ఇళ్లు కట్టుకోమంటే పేదలు ఎలా కట్టుకోగలరని చంద్రబాబు నిలదీశారు. గృహ నిర్మాణాన్ని అగ్గిపెట్టెలాగా చేయడమేంటని ప్రశ్నించారు. శోభనానికి కూడా పనికిరావని వైసీపీ ఎమ్మెల్యేనే వ్యాఖ్యానించారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో యువతిపై గ్యాంగ్‌ రేప్‌ జరిగి వారం దాటినా నేరస్థుల్ని ఎందుకు అరెస్టు చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు. దళిత మహిళపై గ్యాంగ్‌ రేప్‌ జరిగితే ఎస్సీ,ఎస్టీ, అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. నేరస్థుల్లో వైసీపీ వారు ఉండటమే కారణమా అనే సందేహం కలుగుతోందన్నారు. ఇది కప్పిపుచ్చుకోవడానికే దిశ యాప్‌ డ్రామా అన్నారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story