CBN: టికెట్‌ రాలేదని నిరుత్సాహపడొద్దు

CBN: టికెట్‌ రాలేదని నిరుత్సాహపడొద్దు
పొత్తుల కు సహకరిస్తే భవిష్యత్తులో ప్రాధాన్యం... తెలుగుదేశం నేతలకు చంద్రబాబు సూచన

వచ్చే ఎన్నికల్లో పొత్తులతో ఎన్నికలకు వెళ్తునందున టిక్కెట్ రాలేదని ఏ ఒక్కరూ నిరుత్సాహపడొద్దని పార్టీ నేతలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పొత్తులకు సహకరించిన నేతలకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తామని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వారికి ఖచ్చితంగా గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం జగన్ తో విసిగిపోయిన చాలామంది వైసీపీ నేతలు రాష్ట్రాభివృద్ధి కోసం తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, మంచివారై పార్టీకి పనిచేస్తారనుకునే వారినే ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు.అలాంటి చేరికల్ని ప్రోత్సహించి నాయకులు కలిసి పనిచేయాలని సూచించారు.


రా కదలిరా సభలు ముగియగానే మరో ప్రజా చైతన్య యాత్ర చేపడతామని చంద్రబాబు తెలిపారు. ఎన్నికలకు మరో 50రోజులే సమయం ఉన్నందున ప్రతీ ఒక్కరు సీరియస్ గా పని చేయాలన్నారు. ఇప్పటి వరకు జరిగిన... బీసీ సాధికార సభలకు మంచి స్పందన వచ్చినందున...ప్రతీ నియోజకవర్గంలో బీసీ సాధికార సభలు నిర్వహించి తీరాలని పార్టీ నేతలను చంద్రబాబు ఆదేశించారు.

మరోవైపు... చొక్కా చేతులు మడతపెడతామంటూ సీఎం జగన్ గూండాగిరీ చేయాలనుకుంటున్నారా అంటూ నారా లోకేష్‌ మండిపడ్డారు. వాళ్లు చొక్కాలు మడత పెడితే.... పసుపు సైనికులు కుర్చీలు మడత పెడతారని హెచ్చరించారు. ఇన్నాళ్లూ మూడు ముక్కలాట ఆడిన వైకాపా నేతలు... ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించమంటూ కొత్త నాటకానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐదేళ్లుగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారందరిపైనా బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు.


ఉత్తరాంధ్రలో శంఖారావం యాత్ర నిర్వహిస్తున్న నారా లోకేష్‌.... నెల్లిమర్ల, విజయనగరం బహిరంగ సభల్లో పాల్గొన్నారు. వైకాపా పాలనపై రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. ఏం ఇంటికెళ్లి అడిగినా ఇదే మాట చెబుతారని.... ఈ అంశంపై ఇంటింటికీ వెళ్లేందుకు వైకాపా నాయకులు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. మద్యం దుకాణాల వద్దకైనా వచ్చేందుకు సిద్ధమని... జగన్‌కు వచ్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. అభివృద్ధిని గాలికొదిలేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడుతున్న జగన్ ప్రభుత్వంపై కుర్చీలు మడత పెట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారని లోకేష్‌ హెచ్చరించారు. తనను అరెస్ట్ చేయించేందుకు తహతహలాడుతున్న వైకాపా నేతలు... అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఒక్క కేసైనా చూపించగలరా అని లోకేష్ సవాల్ విసిరారు.

Tags

Read MoreRead Less
Next Story