YATRA: చంద్రబాబును ఏమీ చేయలేరు

YATRA: చంద్రబాబును ఏమీ చేయలేరు
ఇదీ ప్రజలందరి పోరాటం... చేయిచేయి కలిపి ముందుకు సాగుదామని నారా భువనేశ్వరి ప్రకటన

చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబ సభ్యుల పరామర్శ యాత్రకు నారా భువనేశ్వరి తిరుపతి జిల్లాలో శ్రీకారం చుట్టారు. నిజం గెలవాలి పేరుతో కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లి ఓదారుస్తున్న ఆమె చంద్రగిరి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ప్రారంభించారు. ముందుగా నారావారిపల్లెలో NTR విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తర్వాత తెలుగుదేశం, జనసేన నేతలు,కార్యకర్తలతో కలిసి యాత్ర ప్రారంభించారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను కలిసి పరామర్శించారు. ఆయా కుటుంబాలకు ధైర్యం చెబుతూ 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. తమ జీవితాల్లో వెలుగులు నింపుతారని టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్ర ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని నారా భువనేశ్వరి అన్నారు.


నారావారిపల్లె నుంచి రోడ్డు మార్గాన చంద్రగిరికి చేరుకున్న భువనేశ్వరితొలుత ప్రవీణ్‌ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రగిరి నుంచి పాకాల మండలం నేండ్రగుంటలో చిన్నబ్బ కుటుంబాన్ని కలిశారు. కుటుంబాలను ఓదార్చిన భువనేశ్వరి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి 3 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. కుమారుడిని కోల్పోయిన తల్లిని ఓదార్చటం ఎంతో కష్టమనిపించిందని భువనేశ్వరి ఆవేదన వ్యక్తంచేశారు. ప్రవీణ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడం ఆమెను ఎంతో కలచి వేసిందని ఎక్స్‌లో పోస్టు చేశారు.


స్కిల్‌, రింగ్‌రోడ్, ఫైబర్‌నెట్‌ కేసులు అంటున్నారని... ఏ కేసులోనైనా ఆధారాలు ఉన్నాయా? అని భువనేశ్వరి ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధికి ఐదేళ్లపాటు చంద్రబాబు ఎంతో కష్టపడ్డారని, ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా పనిచేసేవారని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. పుంగనూరులో సైకిల్‌ ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారని ఇంకెన్నాళీ దారుణాలని నిలదీశారు. ఈ పోరాటాన్ని అందరం కలిసి ముందుకు తీసుకెళ్దామన్న భువనేశ్వరి... లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రను ఆపేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారని ఆరోపించారు. ఎన్నికల ముందు అరెస్టు చేసి చంద్రబాబును మానసికంగా దెబ్బతీస్తే.. టీడీపీ చెల్లాచెదురవుతుందని వైసీపీ నేతలు అనుకుంటారని, కానీ, చంద్రబాబు చాలా స్ట్రాంగ్‌ పర్సనాలిటీ అని ఆయన్ను ఏమీ చేయలేరని తేల్చి చెప్పారు. చంద్రబాబును అరెస్టు చేస్తే అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి మద్దతిచ్చారని, ఆయనపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని, కేసులు, జైలు పేరు చెప్పి టీడీపీ శ్రేణులను బెదిరిస్తున్నారని భువనేశ్వరి అన్నారు. ఏపీలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని, ఎక్కడ చూసినా అరాచకమే రాజ్యమేలుతోందని మండిపడ్డారు. నిజం గెలవాలి.. నిజమే గెలవాలి. సత్యమేవ జయతే’’ అంటూ కార్యకర్తలతో భువనేశ్వరి ప్రతిజ్ఞ చేయించారు. భువనేశ్వరి నిర్వహిస్తున్న నిజం గెలవాలి కార్యక్రమంపై నారా లోకేష్‌ స్పందించారు. అమ్మా... తప్పక నిజం గెలుస్తుంది... అని ఎక్స్‌లో పోస్టు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story