CBN: నన్ను అంతం చేసే కుట్ర జరుగుతోంది

CBN: నన్ను అంతం చేసే కుట్ర జరుగుతోంది
కోట్ల రూపాయలు చేతులు మారాయన్న చంద్రబాబు... ఏసీబీ న్యాయమూర్తికి లేఖ....

రాజమండ్రి కేంద్ర కారాగారంలో తనను అంతమొందించే కుట్ర జరుగుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాజమండ్రి జైలులో తన భద్రతపై అనుమానాలు ఆందోళనను వ్యక్తం చేస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు... ACBన్యాయమూర్తికి మూడు పేజీల లేఖ రాశారు. నార్కొటిక్‌ డ్రగ్స్‌ నేరాలకు పాల్పడిన ముద్దాయిల ద్వారా పెద్దస్థాయిలో ప్రణాళికలు జరుగుతున్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. తనను అంతమొందించేందుకు కోట్ల రూపాయల మేర చేతులు మారాయన్న చంద్రబాబు దీనిపై తూర్పుగోదావరి ఎస్పీ, జైలు అధికారులకు ఓ లేఖ అందినా ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఈ నెల 25న రాసిన లేఖను జైలు అధికారుల ద్వారా న్యాయమూర్తికి పంపారు. తనకు జెడ్ ప్లస్ భద్రత ఉందని, తాను జైల్లోకి వచ్చినప్పుడు అనధికారికంగా వీడియోలు, ఫొటోలు తీశారని లేఖలో వివరించారు. ఆ ఫుటేజ్ ను స్వయంగా పోలీసులే లీక్ చేయడాన్ని తప్పుబట్టారు.

తన ప్రతిష్టను దెబ్బ తీసేందుకే ఈ తరహా వీడియో ఫుటేజ్ విడుదల చేశారని విమర్శించారు. తన అంతమొందించేందుకు కుట్ర పన్నుతున్న తీవ్రవాదులకు సంబంధించిన లేఖ తూర్పుగోదావరిజిల్లా ఎస్పీ,జైలు అధికారులకు వచ్చిందని తెలిపారు. ఆ లేఖపై ఇప్పటివరకూ పోలీసులు విచారణ చేపట్టకపోవడాన్ని ప్రస్తావించారు. జైల్లో అనేక ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్న చంద్రబాబు.. S. కోట కు చెందిన నార్కొటిక్‌ డ్రగ్స్‌ నేరానికి పాల్పడిన ఓ రిమాండ్‌ ఖైదీ పెన్ కెమెరాతో జైలు లోపలి చిత్రాలు తీసిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు.కొందరు గంజాయి ప్యాకెట్లను జైలులోకి విసిరారని, వాటిని... తోటలో ఉన్న కొంతమంది ఖైదీలు పట్టుకున్నారని వివరించారు.

జైలులో ఉన్న 2వేల 200 మంది ఖైదీల్లో 750 మంది తీవ్ర నేరాలకు పాల్పడివారు ఉన్నారని, వారి ద్వారా తన భద్రతకు ముప్పు కలిగిస్తున్నారని ఆరోపించారు. ములాఖత్ లో తన కుటుంబ సభ్యులు కలిసిన తర్వాత బయటకు వస్తున్నప్పుడు వారి చిత్రాలను తీయడానికి.. ఈ నెల 6న జైలు ప్రధాన ద్వారం మీదుగా డ్రోన్ ఎగురవేశారని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో తన కుటుంబసభ్యులకు కూడా ప్రమాదం ఉందనే విషయం అర్థమవుతోందని అన్నారు. గత నాలుగున్నరేళ్లలో అధికార పార్టీ తనపై అనేకసార్లు భౌతిక దాడికి యత్నించిందని చంద్రబాబు గుర్తుచేశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని.. తనకు అందించిన జెడ్‌ ప్లస్‌ భద్రతకు అనుగుణంగా జైలు చుట్టుపక్కల పూర్తిస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని కోరారు. జైలులో చంద్రబాబు భద్రతపై....... నారా భువనేశ్వరి, బ్రాహ్మణి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు రాసిన లేఖ..తీవ్రంగా కలచివేస్తోందన్న భువనేశ్వరి జైలులో పరిస్థితులపై మొదట్నుంచీ ఆందోళనగా ఉందన్నారు. జైలులో తన భర్త క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ కష్టాల నుంచి..చంద్రబాబు క్షేమంగా బయటకు రావాలని తెలిపారు. చంద్రబాబు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు బ్రాహ్మణి కూడా ఎక్స్ లో పోస్ట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story