Chandrababu: వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. రెండు గంటలకు పైగా బోటులోనే..

Chandrababu: వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. రెండు గంటలకు పైగా బోటులోనే..
Chandrababu: పశ్చిమగోదావరిలోని వరద ముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన కొనసాగుతోంది.

Chandrababu: పశ్చిమగోదావరి జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా కోడేరులో వశిష్టగోదావరి నదిపై చంద్రబాబు, టీడీపీ నేతలు బోట్‌ ప్రయాణించారు. ఆచంట నియోజకవర్గం పరిధిలోని అయోధ్య లంక, మర్రిమూల, పుచ్చల లంక, నక్కిలంక, రాయలంక వరకు బోటులోనే ప్రయాణం చేశారు.

బోటులో రెండు గంటలకు పైగా చంద్రబాబు ప్రయాణం చేశారు. వరద బాధితుల వద్దకు స్వయంగా వెళ్లిన ఆయన.. వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా వరదల కారణంగా జరిగిన నష్టాన్ని బాధితులు చంద్రబాబుకు వివరించారు. కలుషిత నీరు ఇస్తున్నారని దీని కారణంగా.. అనారోగ్యాల బారిన పడుతున్నామని చంద్రబాబుకు మొరపెట్టుకున్నారు. ముంపు బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. చంద్రబాబు ఆరోపించారు. వరద బాధితుల కష్టాలు తనను తీవ్రంగా బాధించాయన్నారు. ప్రజలను బురదలో ముంచేసి.. సీఎం గాల్లో తిరుగుతున్నారని మండిపడ్డారు. అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం వరద ప్రాంతాల్లో కనిపిస్తోందన్నారు.

ఇక వరదల బాధితులకు 10వేల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ సర్కారు ఇస్తున్న రెండు వేల రూపాయలు బురద కడుక్కోవటానికి కూడా సరిపోదన్నారు. వరదల్లో దెబ్బతిన్న ఇళ్లకు 50వేల చొప్పున పరిహారం ఇవ్వడంతో పాటు. జీవో ప్రకారం నిబంధనలు అమలు చేయాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా సోంపల్లి వద్ద.. చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయనతోపాటు టీడీపీ నేతలు ప్రయాణిస్తున్న బోటు గోదావరిలో ఒరిగిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. వరద బాధితులను పరామర్శించేందుకు నేతలంతా బోటులో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

ఒక బోటులో టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు పలువురు ముఖ్య నేతలు ఉండగా, మరో బోటులో మాజీ మంత్రులు దేవినేని ఉమ, పితాని సత్యనారాయణ, మంతెన రామరాజు, తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణతోపాటు పలువురు టీడీపీ నేతలు, మీడియా ప్రతినిధులు ఉన్నారు.. సోంపల్లి దగ్గర బోటు దిగే సమయంలో రెండు బోట్లు ఢీకొన్నాయి.. దీంతో రెండో బోటులో ఉన్నవారంతా నదిలో పడిపోయారు. అయితే ఆప్రదేశంలో లోతు తక్కువగా ఉండటంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.. లైఫ్‌ జాకెట్ల సాయంతో నీళ్లలో పడిపోయిన వారిని కాపాడారు. అనంతరం మరో బోటులో టీడీపీ అధినేత చంద్రబాబును పంపించారు.

Tags

Read MoreRead Less
Next Story