LOKESH: జగన్‌లా వాయిదాలు అడగను: నారా లోకేశ్

LOKESH: జగన్‌లా వాయిదాలు అడగను: నారా లోకేశ్
నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు... విచారణకు హాజరవుతానన్న లోకేశ్‌

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అక్టోబరు 4న విచారణకు రావాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఆంధ్రప్రదేశ్ సీఐడీ నోటీసులిచ్చింది. తొలుత వాట్సప్ ద్వారా సీఐడీ అధికారులు లోకేష్ కు నోటీసు పంపారు. నోటీసు అందినట్లు లోకేష్ కూడా వాట్సాప్‌లో సీఐడీకి సమాధానమిచ్చారు. కానీ సీఐడీ అధికారులు ఢిల్లీలోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో ఉన్న లోకేష్ వద్దకు వెళ్లి ప్రత్యక్షంగా నోటీసులు మరోసారి అందజేశారు. అక్టోబరు 4న ఉదయం 10గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులో తెలిపారు. విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో విచారణ ఉంటుందని లోకేష్‌కు చెప్పారు.


ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో సీఐడీ ఇచ్చిన నోటీసుపై నారా లోకేశ్‌ స్పందించారు. జగన్‌ మాదిరిగా వాయిదాలు కోరనని సీఐడీ విచారణను ధైర్యంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. వైసీపీ అనుబంధ విభాగంలా సీఐడీ మారిందన్న లోకేశ్‌... సంబంధంలేని వ్యక్తులను కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డేలేదు.. కానీ, అవినీతి జరిగిందని కేసు పెట్టారని, గత కొన్ని రోజులుగా లోకేశ్‌ కనిపించడం లేదని దుష్ప్రచారం ఎందుకు చేశారని ఇప్పుడు తన వద్దకు వచ్చిన సీఐడీ అధికారులను ప్రశ్నించానని తెలిపారు. మీ కోసం ఎప్పుడూ ఢిల్లీకి రాలేదని అధికారులు చెప్పారని, ఇలాంటి దుష్ప్రచారం చేయడం కరెక్టు కాదని వారికి స్పష్టం చేశానని, ఈ ప్రచారాన్ని సీఐడీ ఖండించకపోతే న్యాయపోరాటం చేస్తానని లోకేశ్‌ తేల్చి చెప్పారు.

మాకున్న 9.65 ఎకరాలు అమరావతి కోర్‌ క్యాపిటల్‌ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో, జాతీయ రహదారి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని లోకేశ్‌ మరోసారి స్పష్టం చేశారు. హెరిటేజ్‌ ప్లాంట్‌ పెట్టాలనే ఆలోచనతో ఆనాడు భూమి కొనుగోలు చేసి ఉండొచ్చని, నేను మంత్రి అయిన తర్వాత హెరిటేజ్‌ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు. తాను ఏనాడూ తప్పు చేయలేదని, జగన్‌ మాదిరిగా క్విడ్‌ ప్రోకోతో పవర్‌ ప్లాంట్‌, పేపర్‌, ఛానల్‌ పెట్టలేదని ఎద్దేవా చేశారు.


జగన్‌ మాదిరిగా వాయిదాలు కోరి తప్పించుకునే అలవాటు తనకు లేదన్న జగన్‌. పదేళ్లుగా జగన్‌, విజయసాయిరెడ్డి బెయిల్‌పై బతుకుతున్నారని విమర్శించారు. వారు విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని, వాళ్ల మాదిరిగా తల్లిని ఆసుపత్రిలో పెట్టి సీబీఐ నుంచి తప్పించుకునేందుకు మేం నాటకాలు ఆడలేదని ఎద్దేవా చేశారు. సీఐడీ అధికారులు వస్తే ధైర్యంగా నోటీసులు తీసుకున్నానని, తమపై దొంగ కేసులు పెట్టి వేధిస్తున్నారని లోకేశ్‌ అన్నారు. ఇన్నర్‌ రింగ్‌రోడ్డుకు సంబంధించి ఎలాంటి తప్పు జరగలేదు.. తప్పుడు కేసులు నిలబడవన్నారు.

Tags

Read MoreRead Less
Next Story