సీఎం చెప్పిన ఆ డైలాగులు ఉత్తుత్తివేనా..

సీఎం చెప్పిన ఆ డైలాగులు ఉత్తుత్తివేనా..
YCP టెక్నికల్‌గా దొరక్కుండా చేయాల్సిందంతా చేస్తోంది. విలువలు, విశ్వసనీయత లాంటి డైలాగ్‌లన్నీ ఉత్తుత్తివేనని తెలిపోయినా ఇంకా గాంభీర్యం ప్రదర్శిస్తూనే ఉంది..

విపక్ష TDP MLAలను తమ క్యాంప్‌వైపు తెచ్చుకునేందుకు వరుసగా ప్రయత్నాలు చేస్తున్న YCP ముఖ్యనేతలు తాజాగా విశాఖ సౌత్‌ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ను పార్టీలో చేర్చుకున్నారు. కుమారులతో కలిసి వైసీపీలో చేరిన ఆయన.. జగన్ పాలనను ఆకాశానికి ఎత్తేశారు. అయితే ఎమ్మెల్యేగా రాజీనామా విషయంపై మాత్రం నోరుమెదపలేదు.కేవలం ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి, ప్రశ్నించేవారు లేకుండా చూసుకునేందుకే తమ పార్టీ MLAలను వైసీపీ లాక్కుంటోందని చంద్రబాబు అన్నారు. ఒకరిద్దరు స్వార్థం కోసం పార్టీని వీడినా తమకు నష్టం లేదన్నారు. విశాఖపట్నం టీడీపీకి కంచుకోటగా ఉంటుందంటూ ధీమా వ్యక్తం చేశారు. అటు.. ఇప్పటికే TDPకి వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాం గుడ్‌బై చెప్పినా.. వారెవరూ కూడా MLA పదవులకు రాజీనామా చేయలేదు. దీన్నే TDP ప్రధానంగా ప్రశ్నిస్తోంది. నాడు అసెంబ్లీ సాక్షిగా జగన్ చేసిన ప్రసంగాన్ని గుర్తు చేస్తున్నారు. TDP నుంచి ఎవరైనా తన పార్టీలోకి రావాలంటే కచ్చితంగా రాజీనామా చేసే రావాలని నాడు జగన్ అన్నారు. ఒకవేళ ఎవరైనా ఆ పద్ధతి అనుసరించకపోతే అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరారు. తాము కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతున్నామంటూ గొప్పలకుపోయారని.. తీరా చూస్తే ఇప్పుడు జరుగుతోంది వేరని అన్నారు. 2019 జూన్‌ 13న అసెంబ్లీ వేదికగా జగన్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తున్న TDP నేతలు.. మాట తప్పం-మడమ తిప్పం అంటే ఇలాగేనా అని ప్రశ్నిస్తున్నారు.

అధికార పార్టీ తీరుపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.. దమ్ముంటే టీడీపీ నుంచి చేరిన నేతలతో రాజీనామా చేయించాలంటున్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీ వదిలినా.. కార్యకర్తలు ఎవరూ ఆయన వెంట వెళ్లలేదని బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. రాజకీయాల్లో విలువలు చచ్చిపోయానని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. తన వల్లే తెలుగుదేశం పార్టీకి పేరువచ్చిందనే భ్రమలో వాసుపల్లి ఉన్నారని విమర్శించారు. అధికారం లేకపోతే బతుకలేమా అని అయ్యన్న ప్రశ్నించారు. యుద్దం అంటూ మొదలైతే భయపడి వెనక్కి తిరిగే ప్రసక్తి లేదన్నారు.

ప్రజాప్రతినిధుల విషయంలో యాంటీ డిఫెక్షన్ లా కచ్చితంగా అమలు చేయాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు, CM అయ్యాక కూడా చెప్పిన జగన్.. ఇప్పుడు ఆయనే స్వయంగా ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. ఫిరాయింపులు సహా అన్ని అంశాల్లోనూ వైసీపీవి యూటర్న్‌ రాజకీయాలు అనే విమర్శలకు కూడా ఇలాంటివి ఊతమిస్తున్నాయి. మొత్తంగా ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో TDP ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్న YCP టెక్నికల్‌గా దొరక్కుండా చేయాల్సిందంతా చేస్తోంది. విలువలు, విశ్వసనీయత లాంటి డైలాగ్‌లన్నీ ఉత్తుత్తివేనని తెలిపోయినా ఇంకా గాంభీర్యం ప్రదర్శిస్తూనే ఉంది.

Tags

Read MoreRead Less
Next Story