రక్తమోడుతున్నా.. ఆదుకునే వారు లేక..

రక్తమోడుతున్నా.. ఆదుకునే వారు లేక..
అది ఏ సినిమా షూటింగో, మరొకటో కాదు.. ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చావు బతుకుల మద్య కొట్టుమిట్టాడుతున్నారు..

అది ఏ సినిమా షూటింగో సర్కస్సో కాదు.. ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చావు బతుకుల మద్య కొట్టుమిట్టాడుతున్నారు.. అయినా ఆదుకునేందుకు ఒక్కరూ ముందుకు రాలేదు.. ఎవరో పుణ్యాత్ముడు 108కి కాల్ చేసి సమాచారం అందించాడు.. అప్పటికే గాయపడిన భార్యాభర్తల్లో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. ఆస్పత్రికి తీసుకు వెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. భర్త మరణించాడు.. భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాద సంఘటన అనంతపూర్ లో చోటు చేసుకుంది.

ఆత్మకూరుకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్, స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న భార్యను ఆమె పని చేస్తున్న పాఠశాలలో దింపేందుకు బండి మీద వెళుతున్నారు ఉదయం 7.30 గంటల ప్రాంతంలో.. నగర శివారులోని గోపాల్ దాబా సమీపంలో 44వ జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో కిందపడ్డారు. సరిగ్గా అదే సమయంలో గుర్తు తెలియని వాహనం వారిపై నుంచి వేగంగా దూసుకెళ్లింది. ఈప్రమాదంలో కిరణ్ కుమార్ కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి.

అనితకు తలపైన, ముఖంపైన తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడి రక్తమోడుతున్న కానిస్టేబుల్ దంపతులను స్థానికులు చుట్టుముట్టి చూస్తున్నారే తప్ప వారిని కాపాడే ప్రయత్నం చేయలేదు.. ఇంతలో ఒకరు 108 కి ఫోన్ చేసి సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది వచ్చి వారిని ఆస్పత్రికి తరలించే వరకు కనీసం మంచినీళ్లు కూడా అందించలేకపోయారు. ఆఖరి నిమిషం వరకు మృత్యువుతో పోరాడిన కిరణ్ కుమార్ చికిత్స పొందుతూ కన్నుమూశాడు..

అన్నా ఈ ఒక్కసారికి కాపాడండి.. పిల్లలు ఉన్నారు అని ఆస్పత్రికి తరలిస్తున్న వారిని కిరణ్ వేడుకున్నాడని అధికారులు గుర్తు చేసుకున్నారు. భార్య తీవ్ర గాయాలతో చికిత్సపొందుతోంది. కానిస్టేబుల్ కిరణ్ కుమార్ మరణవార్త సమాచారంతో పోలీసు శాఖలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎవరిని కదిపినా కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన మంచితనం, సేవాగుణం గురించి చెప్పారు. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు, సహచరులు కిరణ్ కుమార్ ని చూసేందుకు ఆస్పత్రికి చేరుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story