AP: నాలుగోరోజూ అదే నరకయాతన

AP: నాలుగోరోజూ అదే నరకయాతన
పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సందర్భంగా ఉద్యోగులకు నానా అవస్థలు... ఉద్యోగుల తీవ్ర అసహనం

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సందర్భంగా ఉద్యోగులు నాలుగో రోజూ నానా అవస్థలు పడ్డారు. ఓట్ల గల్లంతు, కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలు లేకపోడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. పలుచోట్ల వైసీపీ నేతలు ప్రలోభాలకు గురిచేసేందుకు యత్నించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. విజయవాడలో పోస్టల్‌ బ్యాలెట్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికారులు జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతున్నప్పటికీ... ఉద్యోగులందరికీ ఓటు హక్కు కల్పించడంలో విఫలమయ్యారు. పనిచేసే చోటే ఓటు హక్కు ఉంటుందని... సోమవారం వరకు చెప్పిన అధికారులు... మంగళవారం మాత్రం నివాసముండే చోట ఓటెయ్యాలని చెప్పారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అత్యవసర సర్వీసు ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ అస్తవ్యస్తంగా కొనసాగింది. సమాచార లోపం, అధికారుల సమన్వయ లోపంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు మండిపడ్డారు.


గుంటూరు జిల్లా మంగళగిరిలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ వద్ద ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వరుస క్రమంలో ఓటేసేందుకు చర్యలు తీసుకోకపోవడంతో క్యూలైన్లలో నెట్టుకున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు తమ ఓటు ఎక్కడుందో తెలియట్లేదని అధికారులను అడుగుతుంటే విసుక్కుంటున్నారని... మండిపడ్డారు. గుంటూరులో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియలో తీవ్ర గందరగోళం నెలకొంది. వర్కింగ్‌ ఆర్డర్‌ ప్రకారం విధులు నిర్వహించే చోట ఓటు వేసేందుకు వెళ్తే లేదని చెబుతున్నారని ఉద్యోగులు వాపోయారు. మరోవైపు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో.... ఓటు వేసేందుకు గంటల తరబడి నిలబడాల్సివస్తోందని తాగునీరు కూడా అందుబాటులో పెట్టలేదని... అసహనం వ్యక్తం చేశారు. గుంటూరు మహిళా కళాశాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను గుంటూరు పశ్చిమ కూటమి అభ్యర్థి గల్లా మాధవి పరిశీలించారు. ఓటమి భయంతోనే వైకాపా ఉద్యోగుల ఓటింగ్‌ను అడ్డుకుంటోందని మాధవి మండిపడ్డారు..


శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది కూటమి అభ్యర్థి సవిత పోలింగ్‌ కేంద్రం వద్దకు రాగానే వైకాపా అభ్యర్థి ఉషశ్రీచరణ్ పది మంది కార్యకర్తలతో లోనికి వెళ్లారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదంతో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. లాఠీఛార్జి చేసిన పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించేశారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో పోలింగ్‌ కేంద్రం వద్ద డబ్బులు పంచుతూ వైకాపా నేతలు హల్‌చల్‌ చేశారు. ఓటర్ల జాబితా పట్టుకుని.. పోలింగ్‌ కేంద్రంలో తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. వైకాపా నాయకుల వ్యవహారాన్ని తెలుగుదేశం నేతలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ నాయకుల్ని వదిలేసిన పోలీసులు టీడీపీ శ్రేణులనే బయటకు వెళ్లాలని సూచించారు. దీంతో వైసీపీ వారిని పంపితేనే తామూ వెళ్తామని టీడీపీ నాయకులు పట్టుపట్టడంతో చేసేది లేక పోలీసులు వైకాపా వాళ్లని కూడా బయటకు పంపించారు. పుట్టపర్తి పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో ఓటేయడానికి వచ్చిన ఉద్యోగులు సరైన సౌకర్యాలు లేక అవస్థలు పడ్డారు.

అనంతపురంలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద వైసీపీ నాయకుల ప్రలోభాలు ఆగటం లేదు. పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా నాయకులు ఓటర్లకు డబ్బు ఆశ చూపిస్తున్నారు. వైకాపా నాయకులు డబ్బు పంపిణీ చేస్తున్నారని పోలీసులకు తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. ప్రలోభాలకు గురిచేస్తున్న వైకాపా నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కడప ఆర్డీవో కార్యాలయంలో పోస్టల్‌ బ్యాలెట్‌ వద్ద డబ్బు పంచుతున్నారన్న సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. వైకాపా, తెదేపా నేతలను బయటకు పంపించేసి పటిష్ఠ బందోబస్తు మధ్య ఓటింగ్‌ కొనసాగించారు.

Tags

Read MoreRead Less
Next Story