AP: చంద్రగిరిలో 18 వేల అక్రమ ఓట్లు

AP: చంద్రగిరిలో 18 వేల అక్రమ ఓట్లు
అరణ్య రోదనగా ప్రతిపక్షాల ఆందోళనలు... నిర్లక్ష్యంగా ఎన్నికల అధికారులు

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఓటర్ల జాబితాలో అక్రమాలకు అంతేలేకుండా పోతోంది. కొత్త ఓటరు నమోదు ప్రక్రియను వాడుకొని... ఫారం- 6 ద్వారా వేలాదిగా అక్రమ ఓట్లను చేర్చుతున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఓటున్న వారికి ఇతర ప్రాంతాల్లోనూ ఓట్లున్నాయి. పక్క జిల్లాల వారికి కూడా చంద్రగిరిలో ఓటు హక్కుంది. అంతేకాదు పక్క రాష్ట్రం నుంచి ఉపాధి కోసం ఇక్కడికి వచ్చిన వారికి సైతం ఓటు హక్కు కల్పించారు. ఇలా చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు 18వేలకు పైగా అక్రమ ఓట్లు ఉన్నాయి. ఈ చిత్రాలను చూసి కేంద్ర ఎన్నికల సంఘమే నివ్వెరపోయినా... స్థానిక అధికారులు మాత్రం మాకెందుకులే అన్నట్లు అక్రమ ఓట్లను చేర్చుతూ పోతున్నారు. ఫలితంగా ప్రతిపక్షాల పోరాటం... మౌన రోదనగానే మారింది.


ఎంతలా అంటే నియోజకవర్గంతో పాటు జిల్లా, పక్కనున్న జిల్లాలు, పక్క రాష్ట్రాల వ్యక్తులకు సైతం...ఇక్కడ ఓటు హక్కు కల్పించేంతలా. శ్రీకాళహస్తి నియోజకవర్గం పొగలిలోని 202 పోలింగ్‌ కేంద్రం, చంద్రగిరి నియోజకవర్గం అవిలాల పరిధిలోని ఓటేరు 242 కేంద్రంలో వెంకటరమణ అనే వ్యక్తికి ఓటు హక్కు ఉంది. తిరుపతి నియోజకవర్గం దుర్గానగర్‌ 242 పోలింగ్‍ కేంద్రంలో ఓటు ఉన్న కుసుమ అనే మహిళకు... చంద్రగిరి నియోజకవర్గం ఓటేరు పరిధిలోని 231 పోలింగ్‍ కేంద్రంలోనూ ఓటు ఉంది. ఇదే తరహాలో మల్లకుంట బలరాముడు అనే వ్యక్తికి అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం జంగంపల్లిలోని 112 పోలింగ్ కేంద్రంతో పాటు చంద్రగిరి నియోజకవర్గం పేరూరులోని 200 పోలింగ్ కేంద్రంలోనూ ఓటు జాబితాలో పేరు నమోదైంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట 160 పోలింగ్ కేంద్రంతో పాటు చంద్రగిరి నియోజకవర్గం బోడిరెడ్డివారిపల్లి 48 పోలింగ్ కేంద్రంలో శ్రావ్య పేరుతో ఓటర్ల జాబితాలో నమోదై ఉండటం అక్రమాలకు అద్దం పడుతోంది. వీరే కాదు ఒడిశా నుంచి పనికోసం వచ్చిన వారికి సైతం చంద్రగిరిలో ఓటు హక్కు ఉంది. ఇలా మొత్తంగా 18వేల అక్రమ ఓట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.


అక్రమంగా కొత్త ఓట్లను చేర్చేందుకు రోజువారీగా వందల్లో కొందరు దరఖాస్తులు దాఖలు చేస్తున్నారు. అధికారులు సైతం వీటిలో కొన్నింటిని తిరస్కరించి.. మరికొన్నింటిని ఆమోదిస్తున్నారు. ఫలితంగా పెద్దసంఖ్యలో అనర్హులైన బయటి వ్యక్తులకు స్థానికంగా ఓటు వేసే అవకాశం కలుగుతోంది. చంద్రగిరిలో ఓటు హక్కు కల్పించినవారికి వారి సొంత ప్రాంతాల్లోనూ ఓటు హక్కు ఉంది. ఇలా రెండుచోట్లా ఓటు ఉన్నా... పరిశీలించకుండానే వారు దాఖలు చేస్తున్న దరఖాస్తులను స్థానిక అధికారులు ఆమోదిస్తున్నారు. ఈ అక్రమాలను స్థానిక అధికారులతో పాటు ఈసీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. దీనితో పాటు ఫారం- 7,8ల ద్వారా విపక్షాలతో పాటు వారి సానుభూతిపరుల ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగిస్తున్నారని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story