Andhra Pradesh: ఓటీఎస్ పేరుతో బలవంతపు వసూళ్లు, వేధింపులు.. ఏపీలో ప్రజల కష్టాలు..

Andhra Pradesh: ఓటీఎస్ పేరుతో బలవంతపు వసూళ్లు, వేధింపులు.. ఏపీలో ప్రజల కష్టాలు..
Andhra Pradesh: ఎన్నికల్లో నవరత్నాలు అన్నారు. అధికారంలోకి వచ్చాక పథకాల అమలులో అంతా రివర్స్‌.

Andhra Pradesh: ఎన్నికల్లో నవరత్నాలు అన్నారు. అధికారంలోకి వచ్చాక పథకాల అమలులో అంతా రివర్స్‌. అమ్మ ఒడి, విద్యాదీవెన వంటి పథకాల్లో కొత్త కొర్రీలు, నవకష్టాలు పెడుతూ పీఛేమూడ్ అని ఎంతలా కోతలు, వాతలు పెడుతున్నారు. నిన్నామొన్నటి వరకు ఓటీఎప్ పేరుతో పేదల నుండి ముక్కుపిండి డబ్బులు వసూలు చేసి వేధింపులకు గురి చేసింది జగన్ సర్కారు. ఇపుడు కొత్తగా మూడేళ్ల తర్వాత నవరత్నాల్లో మరో పథకాన్ని చేర్చింది. అదే జగనన్న జప్తు దీవెన..

జగనన్న జప్తు దీవెన పథకం అసలు లక్ష్యం.. చెత్త పన్ను కట్టకపోతే ఇళ్లు, షాపుల ముందు చెత్తపోయడం. కుళాయి పన్ను కట్టకపోతే నీళ్లు బంద్‌ చేయడం, కుళాయిలకు బిరుడాలు బిగించడం, ఆస్తి పన్ను చెల్లించకపోతే ఇంట్లో సామాన్లు ఎత్తుకుపోవడం.. ఇంటికి తాళం వేయడం.. సీజ్‌ చేయడం. ఇది వైసీపీ ప్రభుత్వం జగనన్న జప్తు దీవెన పథకం ఉద్దేశ్యం.

ఇప్పటికే ఆస్తి, చెత్త పన్నుతో ప్రజలపై పన్నుపోటు పొడుస్తున్న జగన్.. వాటి వసూలుకు నాటి ఔరంగజేబును మించిపోతున్నారని ఏపీలో ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. జగన్ ప్రభుత్వ తీరు కాల్‌మనీ వడ్డీ వ్యాపారులను తలపిస్తోందని మండిపడుతున్నాయి. ఫైనాన్స్‌ వ్యాపారుల వేధింపులకు ఏమాత్రం తగ్గకుండా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని మోహనగర్‌లో గొర్రెల సత్తిబాబు, గొర్రెల రమణ ఇళ్లకు తాళాలు, సీలు వేయడం సంచలనం రేపింది. ఇంట్లో మనుషులు ఉన్నా సరే గేటుకు తాళాలు వేయడంతో జనం బెంబేలెత్తుతున్నారు. నెలాఖరులోగా ఇంటి పన్ను, కుళాయి పన్ను కట్టకపోతే ఇంట్లో సామాన్లు తీసుకుపోతామంటూ.. కాకినాడ, ప్రత్తిపాడులో వాహనాలకు బ్యానర్లు కట్టి మరీ వీధుల్లో తిప్పుతున్నారు.

పన్నుల వసూళ్ల కోసం గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ పేరున స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పన్నులు కట్టకపోతే చర్యలు తప్పవని మైకుల్లో హెచ్చరిస్తూ వీధివీధినా తిరుగుతున్నారు పంచాయతీ అధికారులు. ప్రభుత్వం తీరుపై మెజార్టీ ప్రజలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. స్థానికంగా అనేక సమస్యలు ఉన్నా వాటిని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. చెత్త పన్ను కట్టలేదని మొన్న కర్నూలులో దుకాణాల ఎదుట చెత్త వేశారు.

కుళాయి, ఆస్తి పన్ను కట్టలేదని ఆదోని మున్సిపాలిటీలో దాదాపు 1500 ఇళ్లకు కుళాయి కనెక్షన్లను తొలగించారు. ఆస్తి పన్ను కట్టకపోతే పెన్షన్‌, రేషన్‌, జగనన్న చేదోడు, ఆసరా వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ నిలిపివేస్తామని చాలా చోట్ల సచివాలయ సిబ్బంది బెదిరింపులకు పాల్పడుతుండటం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ చరిత్రలో ఇంతటి వేధింపులు ఎన్నడూ చూడలేదని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు.

అసలు నీళ్ల సరఫరానే లేని కాలనీకి నీటిపన్ను ఎలా చెల్లించాలని ప్రశ్నిస్తున్నా సరే జగన్ ప్రభుత్వానికి పట్టడం లేదని వాపోతున్నారు. ఇప్పటికే రకరకాల పేరుతో పన్నుల పేరుతో వసూళ్లు చేస్తున్న ప్రభుత్వం.. ఈ నెలాఖరులోగా వేయి కోట్లు రాబట్టుకోవాలన్నది తాపత్రయం. అందుకే, చెత్త పన్ను కట్టకపోతే.. ఇళ్ల నుంచి చెత్త తీసుకెళ్లబోమని హెచ్చరిస్తున్నారు. చెత్తపై పన్ను చెల్లించకపోతే వ్యాపార అనుమతులు రద్దుచేస్తామని విజయవాడ, విశాఖలో దుకాణదారులను హెచ్చరిస్తున్నారు.

శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాలోని మున్సిపల్‌ సిబ్బంది.. పన్నులు చెల్లించని ఇళ్లకు వెళ్లి పన్నులు చెల్లిస్తారా, ఇళ్లలో వస్తువులు తీసుకెళ్లాలా అని నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో జగన్ సర్కారు పన్ను బాదుడుతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు.. ఒకేసారి అంత పన్ను కట్టలేక లబోదిబోమంటున్నారు.

పన్ను చెల్లించేందుకు గడువు ఇవ్వాలని వేడుకుంటున్నా.. వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం కనికరం లేకుండా ప్రవర్తిస్తోందని ప్రజలు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. ఆస్తి పన్ను వసూలు చేయడం కొత్త కాదు. గత ప్రభుత్వాల హయాంలోను ఉండేవి. కానీ ఏకంగా ఇంటినే జప్తు చేయడం, వేధింపులకు గురి చేయడం ఏపీలో గతంలో ఎప్పుడూ జరగలేదు. కానీ జప్తు చేయడాన్ని కూడా ప్రభుత్వ పాలకులు సమర్ధించుకుంటున్నారు.

ప్రభుత్వం తీరుపై సామాన్య ప్రజల నుంచి ప్రతిపక్ష పార్టీల నేతల వరకు మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వమూ ఈ విధంగా ప్రజల గౌరవాన్ని కించపరిచేలా వ్యహరించలేదని విమర్శిస్తున్నారు. ప్రజలను పీడించి, వేధించి ఖజానా నింపుకోవాలనే అహంకారపూరిత నైజంతో జగన్.. ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తున్నారు.

డబ్బుల కోసం ప్రజలను పీడిస్తున్న పాలకుల వికృత మనస్తత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తుతున్నారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలేంటి..? అధికారంలోకి వచ్చాక చేయాల్సిందేమిటి..? చేస్తున్నదేంటి..? అని ప్రశ్నిస్తున్నారు. ప్రజల పరువుప్రతిష్టలను మంటగలిపేలా.. క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్న పాలకులను ఏపీ ప్రజానీకం నిలదీయాలని టీడీపీ, జనసేన సహా అన్ని విపక్ష పార్టీల నేతలు పిలుపునిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story