Three Capitals: టీడీపీలో చేరిన బహుజన పరిరక్షణ సమితి నేతలు

Three Capitals: టీడీపీలో చేరిన బహుజన పరిరక్షణ సమితి నేతలు
మూడు రాజధానుల శిబిరం ఎత్తివేసిన వైసీపీ నేతలు

ఏపీ రాజధాని అమరావతే అంటూ రైతులు గత ఐదేళ్లుగా ఉద్యమం నిర్వహిస్తుండగా, వారికి పోటీగా నాలుగేళ్ల కిందట వైసీపీ నేతలు మూడు రాజధానుల శిబిరం ఏర్పాటు చేశారు. నాలుగేళ్లుగా మందడం గ్రామంలో వైసీపీ నేతలు నిర్వహిస్తున్న మూడు రాజధానుల శిబిరం నేటితో మూతపడింది. ఈ శిబిరం నిర్వాహకుడు గురునాథం, మరికొందరు నేతలు నేడు నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. వీరిలో వైసీపీ అనుబంధ బహుజన పరిరక్షణ సమితి నేతలు ఉన్నారు. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఈ నేతలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను కలిశారు.

వైసీపీ నేతలు అమరావతిలో మూడు రాజధానుల శిబిరం ఎత్తివేసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ను కలిశారు. దాదాపు నాలుగు సంవత్సరాలుగా మందడం సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద శిబిరం నిర్వహిస్తూ వచ్చారు. శిబిరం ఎత్తివేసి వైసీపీ అనుబంధ బహుజన పరిరక్షణ సమితి నేతలు లోకేశ్ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. కేశినేని చిన్ని ఆధ్వర్యంలో శిబిరం నిర్వాహకులైన బహుజన పరిరక్షణ సమితి నేతలు లోకేశ్​ను కలిసి తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. మూడు రాజధానులతో లాభం జరుగుతుందని నమ్మి మోసపోయామని బహుజన పరిరక్షణ సమితి అధ్యక్షుడు మాదిగాని గురునాథం అన్నారు.

చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ వైసీపీ ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా తమను నమ్నించే యత్నం చేసిందని విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణ కూటమితోనే సాధ్యమని ఆలస్యంగా గ్రహించామన్నారు. నియంత పోకడలు ప్రదర్శిస్తూ పేదలకు పెత్తందారులకు యుద్ధమని సీఎం జగన్ అంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బహుజనుల్ని ఏకం చేసి తెలుగుదేశం కూటమి గెలుపు కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. రాజధాని రైతులకు ఇకపై తమ సహకారం ఉంటుందని ఆయన తెలిపారు.

బహుజన రాజకీయ యాత్ర చేపట్టి రాజకోట రహస్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. తమ పోరాటాన్ని రాజకీయంగా నందిగం సురేష్, కొడాలి నాని వాడుకున్నారని నేతలు ఆరోపించారు. రాజధాని ఉద్యమాన్ని ఎన్నో అరాచక శక్తులు ఇబ్బంది పెట్టాయని తెలుగుదేశం విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని అన్నారు. బహుజన పరిరక్షణ సమితి వాస్తవాలు గ్రహించి మూడు రాజధానుల ఉద్యమానికి స్వస్తి పలకడం శుభ పరిణామమని చిన్ని పేర్కొన్నారు. రాజకోట రహస్యాలు ఏంటో తెలుసుకునేందుకు రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story