JAGAN: ఎయిడెడ్‌ పాఠశాలల మూసివేతకు నిర్ణయం!

JAGAN: ఎయిడెడ్‌ పాఠశాలల మూసివేతకు నిర్ణయం!
ఇప్పటికే అనేక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిన జగన్‌ సర్కార్‌... ఎయిడెడ్‌ పాఠశాలల మూసివేత చర్యలు ముమ్మరం

ఆంధ్రప్రదేశ్‌లో అనేక వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం.....ఇప్పుడు విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రకు తెరతీసింది. లక్షలాది మందికి తక్కువ ఫీజులతో విద్య అందిస్తున్న ఎయిడెడ్‌ పాఠశాలలను మూసివేసేందుకు నిర్ణయించింది. ఎంత వ్యతిరేకత వచ్చినా ఆ మేరకు చర్యలు కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా 11 ఉమ్మడి జిల్లాల్లోని 76 పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించిన జగన్‌ ప్రభుత్వం ఈ దిశగా అక్కడ తనిఖీలు చేయాలని జిల్లా విద్యాధికారులు, ప్రాంతీయ సంచాలకులను ఆదేశించింది. మూసివేతకు జగన్‌ ప్రభుత్వం చెబుతున్న కారణం గత విద్యా సంవత్సరంలో ఈ బడుల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదని. విద్యార్థులు, బడుల అవసరాలు, చుట్టుపక్కల పాఠశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని అధికారులు తనిఖీ చేయనున్నారు. వీరు ఇచ్చే నివేదిక ఆధారంగా ఎయిడెడ్‌ పాఠశాలలను ప్రభుత్వం మూసివేయనుంది. ఇక్కడ పని చేస్తున్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది జీతాల కోసం అందజేసే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ను మూసివేత తర్వాత నిలిపివేయనుంది. వాటి గుర్తింపును సైతం రద్దు చేయనుంది.


జగన్‌ ప్రభుత్వం ఎయిడెడ్‌ పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించిన ఉమ్మడి జిల్లాల జాబితాలో శ్రీకాకుళం, అనంతపురం మినహా మిగతావన్నీ ఉన్నాయి. వీటిలో అత్యధికంగా పశ్చిమ గోదావరిలో 34 ఉండగా, తర్వాత స్థానంలో 11 పాఠశాలలతో శ్రీకాకుళం ఉంది. ఇవన్నీ సున్నా ప్రవేశాలతో కొనసాగుతున్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేసింది. మూసివేత తర్వాత ఆయా బడుల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను ఇతర బడుల్లో సర్దుబాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 1900కు పైగా ఎయిడెడ్‌ పాఠశాలలు ఉండగా, వీటిలో సుమారు 7వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. దాదాపు 2లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పుడు 76 పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో వీటిలో అనేకం ప్రైవేటుగా మారనున్నాయి. అదే జరిగితే విద్యార్థులపై ఫీజుల భారం పడనుంది. ఇప్పటి వరకు నామమాత్రపు ఫీజులు చెల్లించిన పేదలకు ఇది ఇబ్బందిగా మారనుంది.


ఎయిడెడ్‌ పాఠశాలల మూసివేత కోసం జగన్‌ సర్కార్‌ ఓ క్రమ పద్ధతిలో ప్రయత్నాలు చేపట్టింది. వీటిలో నియామకాలు మొదట మూడేళ్లకు ఒప్పంద ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది. మిగిలి ఉన్న చోట నుంచి సర్దుబాటు చేసిన తర్వాతే నియామకాలు చేపట్టాలని హెచ్చరించింది. తర్వాత మౌలిక సదుపాయాలు లేవని, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది. మౌలిక సదుపాయాల కొరత, 40మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న బడులపై నిఘా పెట్టింది. విద్యార్థుల సంఖ్య పెంచుకోకుంటే మూసివేస్తామని ఆయా ఎయిడెడ్‌ పాఠశాలల యాజమాన్యాలను 2022లో హెచ్చరించింది.

ఎయిడెడ్‌ పాఠశాలల మూసివేత మొండి పన్నాగం వెనక జగన్‌ ప్రభుత్వానికి పెద్ద ఆలోచనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఎయిడెడ్‌ బడుల నిర్వహణ కోసం జగన్‌ ప్రభుత్వం ఏటా సుమారు 700 కోట్ల రూపాయల గ్రాంట్‌ అందజేస్తోంది. అక్కడి సిబ్బంది జీతాలు దీని ద్వారా చెల్లిస్తున్నారు. అంటే.. లక్షలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తును బలి చేసి జగన్‌ సర్కార్‌ చేస్తున్న విన్యాసాల వల్ల ప్రభుత్వానికి ఆదా అయ్యేది ఏటా ఆ 7వందల కోట్ల రూపాయలే. ఇప్పటికైనా జగన్‌ సర్కార్‌ ఎయిడెడ్‌ పాఠశాలల మూసివేత నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, తద్వారా విద్యార్థులు, రాష్ట్ర భవిష్యత్తు బలికాకుండా ఆపాలని లక్షలాది మంది తల్లితండ్రులు చేతులెత్తి వేడుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story