PAWAN: ఏపీలో ఎక్కడ చూసినా కూటమి గాలే

మార్పు తథ్యమన్న పవన్‌ కల్యాణ్‌.... జగన్‌పై తీవ్ర విమర్శలు

జగన్‌పై చిన్న గులకరాయి పడితేనే యువకుడిపై కేసు పెట్టారని, దళితుడిని చంపి మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేసిన అనంతబాబుపై మాత్రం చర్యలు లేవని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. రైతులకు మద్దతు ధర ఇప్పించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న పవన్‌... జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ చూసినా మార్పు కనిపిస్తోందని, వైసీపీని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు సమయం ఇవ్వాలని... ఫొటోల కోసం పోటీ పడొద్దని.... క్షేత్రస్థాయిలో పర్యటించకుండా అడ్డుపడొద్దు అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

ఐదేళ్ల తన సంపాదనలో రూ.70కోట్ల ట్యాక్స్‌ కట్టానని... డబ్బు సంపాదన కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని పవన్‌ స్పష్టం చేశారు. ప్రజల కష్టాలు తీర్చడానికి మీలో ఒకడిగా వచ్చానని... రైతులకు సాగునీరందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని పవన్ మండిపడ్డారు. ప్రభుత్వ చర్యల వల్ల రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటించారని.. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ ఐదు ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నారని... కానీ, కోనసీమ రైతుల కన్నీళ్లు తుడవడానికి మనసురాలేదన్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాగానే రైతుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. జగన్‌పై గులకరాయి పడితే అంతమంది జనసమూహం ఉన్నా నిందితుడిని పట్టుకోగలిగారని... కానీ, అంతర్వేది నరసింహస్వామి రథాన్ని కాల్చేసిన దుండగులను మాత్ర ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారని పవన్‌ మండిపడ్డారు. ఇలాంటి దుష్టపరిపాలన ఆగాలని... తన కోసం 40 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లాలకు దించారని.... అన్నీ తెగించే రాజకీయాల్లోకి వచ్చా. జగన్‌.. గుర్తు పెట్టుకో ఇది 2019 కాదు.. 2024’’ అని పవన్‌ హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story