TDP-JANASENA: ప్రజాకర్షకంగా టీడీపీ-జనసేన మినీ మేనిఫెస్టో

TDP-JANASENA: ప్రజాకర్షకంగా టీడీపీ-జనసేన మినీ మేనిఫెస్టో
11 అంశాలతో కూడిన మినీ మెనిఫెస్టో రూపకల్పన.... 5 పథకాలను సూచించిన జనసేన

ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ-జనసేన దూకుడుగా ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే ఎన్నికలకు కలిసి వెళ్తామని ప్రకటించిన ఇరు పార్టీలు..మరో కీలక ముందడుగు వేశాయి. టీడీపీ-జనసేనకూటమిలో భాగంగా ఎన్నికల సన్నద్ధతలో కీలక పాత్ర పోషించే మినీ మేనిఫెస్టోని ఇరు పార్టీలు ప్రకటించాయి. 11 అంశాలతో కూడిన ఈ మేనిఫెస్టో ప్రజాకర్షకంగా ఉంది. వాటిల్లో టీడీపీ ప్రతిపాదించిన 6 పథకాలకు తోడు జనసేన సూచించిన 5 పథకాలను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం - జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి భేటీ ముగిసింది. సంక్షేమంతో కూడిన అభివృద్ధే ప్రధాన అజెండాగా టీడీపీ-జనసేన మేనిఫెస్టోపై భేటీలో కమిటీ చర్చించింది. మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభి.. జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్‌ ఉన్నారు. భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఇరు పార్టీల నేతలు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నుంచి 6 అంశాలు, జనసేన నుంచి ప్రతిపాదించిన 5 అంశాలను చేర్చి ఉమ్మడిగా 11 అంశాలతో కూడిన మినీ మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలిపారు.


మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మినీ మేనిఫెస్టో వివరాలను వెల్లడించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా స్టార్టప్ సంస్థల ఏర్పాటుకు రూ. 10లక్షల వరకూ రాయితీ, ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు, అమరావతే రాజధానిగా కొనసాగింపు, పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం వంటివి కొత్తగా మినీ మేనిఫెస్టోలో చేర్చారు. దీనిని సూపర్ సిక్స్‌గా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. 11 అంశాలతో మినీ మేనిఫెస్టో రూపొందించామని, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై ప్రాథమికంగా చర్చించామని యనమల రామకృష్ణుడు తెలిపారు. ఇప్పటికే టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో మినీ మేనిఫెస్టోపై ప్రజల్లోకి వెళ్తోందన్న యనమల... ఆంధ్రప్రదేశ్‌లో చాలా సమస్యలున్నాయని గుర్తు చేశారు. సమస్యలున్నా వాటిని జగన్‌ పరిష్కరించట్లేదని ఆరోపించారు. తుది మేనిఫెస్టో విడుదల చేసే ముందు వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో చర్చిస్తామని... ఈ మీటింగ్ విశేషాలను పార్టీల అధినేతల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. సౌభాగ్యపదం పేరుతో యువత వ్యాపారాలు చేసుకునేందుకు ఆర్థిక సాయం అందించే అంశాన్ని జనసేన ప్రతిపాదించింది. సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్రాభివృద్ధికి పెద్ద పీట వేసేలా ప్రణాళికలు రచించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన చేస్తామని నేతలు తెలిపారు.

టీడీపీ-జనసేన మినీ మేనిఫెస్టో

ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు.

అమరావతే రాజధానిగా కొనసాగింపు.

పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం.

ఎంఎస్‌ఎమ్‌ఈ అంకుర సంస్థల ఏర్పాటుకు రూ. 10 లక్షల వరకూ రాయితీ

ఆర్థిక వ్యవస్థ బాగుపడేలా ప్రణాళికల రూపకల్పన.

బీసీలకు రక్షణ చట్టం

ఏపీని సంక్షోభం నుంచి బయటకు తెచ్చే విధానాలు

రద్దు చేసిన సంక్షేమ పథకాలపై పునఃపరిశీలన.

Tags

Read MoreRead Less
Next Story