ఏపీలో వినాయక చవితి ఉత్సవాలపై రగడ..!

ఏపీలో వినాయక చవితి ఉత్సవాలపై రగడ..!
ఏపీలో వినాయక చవితి ఉత్సవాలపై జరుగుతున్న రగడ రోజురోజుకూ పెరుగుతోంది. చవితి వేడుకలకే విఘ్నాలు ఎందుకంటూ హిందూ సంఘాలు ఫైరవుతున్నాయి..

ఏపీలో వినాయక చవితి ఉత్సవాలపై జరుగుతున్న రగడ రోజురోజుకూ పెరుగుతోంది. చవితి వేడుకలకే విఘ్నాలు ఎందుకంటూ హిందూ సంఘాలు ఫైరవుతున్నాయి.. సర్కారు ఆంక్షలపై ఏపీ వ్యాప్తంగా నిరసన జ్వాలలు పెల్లుబికుతున్నాయి.. హిందూ సంఘాలు, బీజేపీ శ్రేణులు రోడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్నాయి.. హిందూ సంప్రదాయాలను ధ్వంసం చేయాలని జగన్‌ ప్రభుత్వం కంకణం కట్టుకుందంటూ మండిపడుతున్నాయి.. అసలు.. పీఠాధిపతులు, మఠాధిపతులు, వైదిక వర్గాల్లో ఎవరినీ సంప్రదించకుండా ఎలా నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.. అటు బీజేపీ నేతలు కూడా ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతున్నారు. వైసీపీ నేతల ర్యాలీలు, సమావేశాలకు లేని కరోనా నిబంధనలు.. వినాయక చవితికే ఎందుకని నిలదీస్తున్నారు.

కరోనాపై నిర్వహించిన సమీక్షలో వినాయక చవితి ఉత్సవాలపై కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. కరోనా ముప్పు కారణంగా చవితి ఉత్సవాలను ఇళ్లలోనే చేసుకోవాలని జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో గణేష్‌ విగ్రహాల ఏర్పాటు, నిమజ్జన ఊరేగింపులు వద్దని చెప్పుకొచ్చారు. వినాయక చవితి ఉత్సవాలపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టడంపై ఉత్సవ కమిటీలతోపాటు వివిధ రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. అధికార పార్టీ చేపట్టే రాజకీయ సభలు, ర్యాలీలు, ఇతర కార్యక్రమాలకు లేని కరోనా నిబంధనలు.. వినాయక చవితి ఉత్సవాలకే వర్తిస్తాయా అని ప్రశ్నిస్తున్నారు. హిందువులు తొలిపూజ చేసే వినాయక చవితిని అడ్డుకోవడం ఏంటనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. ఈసారి వినాయక చవితిని ఘనంగా జరిపిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటిస్తే.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యహరిస్తోందని మండిపడుతున్నారు. పక్క రాష్ట్రాల్లో లేని ఆంక్షలు ఏపీలో పెట్టడం ఏంటని నిలదీస్తున్నారు.

కరోనా కారణంగా గతేడాది చవితి ఉత్సవాలు జరగలేదు. ఈ ఏడాది కరోనా తీవ్రత తగ్గిన నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని భావించారు. పెద్ద విగ్రహాలతో మండపాలు ఏర్పాటు చేసేందుకు అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. వినాయక విగ్రహాల కోసం వేలకు వేలు అడ్వాన్సులు చెల్లించారు. లైటింగ్, డీజే సౌండ్‌ మొదలుకుని అర్చకుల వరకు అందరికీ అడ్వాన్సులు ఇచ్చారు. ఈ సమయంలో చవితి ఉత్సవాలు బయట చేయొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై అన్ని జిల్లాల్లోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్సవాలు జరుపుకునేందుకు పోలీసులు అనుమతి ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు.

విగ్రహాల తయారీయే వృత్తిగా జీవిస్తున్న కొన్నివేల మంది కుటుంబాలు సైతం ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఒక్కో తయారీదారుడు విగ్రహాల తయారీకి అయ్యే సామాగ్రి కోసం 15 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. ఉన్నట్టుండి పండగ ఇళ్లలోనే చేసుకోవాలనడంతో.. చేసిన అప్పులు, వడ్డీలు కట్టలేక తమ కుటుంబాలు చితికి పోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది 30 వేల నుంచి 50 వేల రూపాయల వరకు అడ్వాన్సులు తీసుకున్నారు. ఆ సొమ్మును విగ్రహాల తయారీకి అవసరమైన సామగ్రి కొనేందుకు ఖర్చు చేశారు. ప్రస్తుతం అడ్వాన్సులు తిరిగి చెల్లించే పరిస్థితిలో లేమని విగ్రహ తయారీదారులు తెగేసి చెబుతుండటంతో ఉత్సవ కమిటీ నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story