CBN: జగన్‌ను బాయ్‌కాట్‌ చేయండి

CBN: జగన్‌ను బాయ్‌కాట్‌ చేయండి
ప్రజలకు చంద్రబాబు పిలుపు... పోలవరం పూర్తి చేయడమే తన చిరకాల వాంఛ అని ప్రకటన

కృష్ణాజిల్లా పామర్రులో నిర్వహించిన.. ప్రజాగళం సభలో పాల్గొన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు డెల్టా రైతులకు వైసీపీ ప్రభుత్వం నీళ్లివ్వలేకపోతోందని మండిపడ్డారు. సీజన్ కోల్పోరాదనే పట్టిసీమను తెచ్చామని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టులో తాను నీళ్లు పారిద్దామనుకుంటే. జగన్ కన్నీళ్లు పారిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరం పూర్తి చేసి తద్వారా నదుల అనుసంధానం చేయడమే తన చిరకాల వాంఛ అని తెలిపారు.


ఆంధ్రప్రదేశ్‌ ప్రజల భవిష్యత్తుకు నాదీ గ్యారెంటీ అని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రజలు కోరుకునే సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు అందించేది...ఎన్డీఏ కూటమేనని తేల్చిచెప్పారు. జగన్‌ అమరావతిని అడ్డుకొని, రివర్స్ పాలనతో ప్రజల జీవితాలను రివర్స్ చేశారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం పిల్లలను, యువతను గంజాయి బారినపడేలా చేస్తోందని ధ్వజమెత్తిన చంద్రబాబు కృష్ణా జిల్లా అనే తులసీవనంలో గంజాయి మొక్కలు మొలిచాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తు కారణంగా కొనకళ్ల నారాయణ, దేవినేని ఉమకు టికెట్లు ఇవ్వలేకపోయానన్న చంద్రబాబు పార్టీ కోసం త్యాగాలుచేసిన వారిని గుండెల్లో పెట్టుకుంటానని స్పష్టం చేశారు.

ఐదేళ్ల తర్వాత ప్రజల్లోకి వస్తున్న సీఎం జగన్‌ని ప్రజలంతా బాయ్‌కాట్‌ చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో వైకాపాని కట్టకట్టి బంగాళఖాతంలో కలపాలని తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు... ప్రజలంతా కూటమితో కలిసి రావాలని చంద్రబాబు కోరారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు..... ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లాలో పర్యటించారు. పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. తెలుగుదేశం శ్రేణులు, జనసైనికులు, కమలం కార్యకర్తలు పెద్దఎత్తున ఉత్సాహంగా తరలివచ్చారు. 2014లో ఒక్క ఛాన్సంటూ.. ముద్దులు పెట్టిన జగన్‌ ఐదేళ్లగా పిడిగుద్దులు గుద్దారని చంద్రబాబు ధ్వజమెత్తారు. మంత్రి జోగి రమేష్‌ పెడన నియోజకవర్గం మొత్తాన్ని దోచుకుని... ఇప్పుడు పెనమలూరుకి వచ్చారంటూ చంద్రబాబు మండిపడ్డారు. రోగి లాంటి జోగికి... బోడే ప్రసాద్ మెడిసిన్‌ అని తెలిపారు.

అన్యాయానికి ప్రజాచైతన్యమే విరుగుడని చంద్రబాబు తెలిపారు. అంతా కలిసి... కూటమి గెలుపించాలని కోరారు. ఇప్పుడు జగన్‌కు ఏ అధికారం లేదన్న చంద్రబాబు...ఏదైనా ఎన్నికల సంఘమే చేస్తుందన్నారు. అధికారులకు అన్ని పార్టీలు సమానమే అని, అయినా కొందరు జగన్‌ కోసమే పనిచేస్తున్నారని హెచ్చరించారు. త్వరలో జగన్‌ మాజీ సీఎం అవుతారనే విషయం గుర్తించుకోవాలని...చంద్రబాబు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story