LOKESH: అడ్డొచ్చిన వారిని తొక్కుకుంటూ పోతాం: లోకేశ్‌

LOKESH: అడ్డొచ్చిన వారిని తొక్కుకుంటూ పోతాం: లోకేశ్‌
రాజకీయాల్లోకి రావడం బ్రహ్మణి ఇష్టం... విలేకర్ల ఇష్టాగోష్టిలో లోకేశ్‌ వ్యాఖ్యలు

రాజకీయాల్లోకి రావడం అనేది తన సతీమణి బ్రాహ్మణి ఇష్టమని నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. నిజాయతీపరులకు శిక్ష పడితే చదువుకున్నవాళ్లు, సామాజిక స్పృహ ఉన్నవారు రాజకీయాల్లోకి రారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబును చూసి షాకయ్యానని.. నిజాయతీగా పనిచేసిన వ్యక్తి ఇక్కడికి వచ్చారా అనిపించిందని గుర్తు చేసుకున్నారు. ఢిల్లీలో ఎంపీ గల్లా జయదేవ్‌ నివాసంలో విలేకర్లతో నారా లోకేశ్‌ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. హెరిటేజ్‌ వ్యాపార వృద్ధికి తాము తీసుకొనే ఎన్నో నిర్ణయాలకు ఆయన బ్రేక్‌లు వేశారని చెడ్డ పేరు వస్తుందేమోనని వద్దన్నారని చెప్పారు. చంద్రబాబు కారణంగానే హెరిటేజ్‌ గ్రోత్‌ నిదానంగా జరిగిందని లోకేష్‌ తెలిపారు. లేదంటే ఇప్పటికే మూడురెట్లు పెరిగేదన్నారు. తమకు ఐటీ కంపెనీల్లేవని సైబరాబాద్‌లో ఎకరం భూమి కూడా లేదని లోకేష్‌ స్పష్టం చేశారు.


నీతి, నిబద్ధతతో 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి చంద్రబాబని... తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. చంద్రబాబు హక్కులను అడ్డుకుంటున్న తీరుపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. ఆధారాల్లేని కేసులో చంద్రబాబును ఇన్ని రోజులుగా రిమాండ్‌లో ఉంచడం ఆశ్చర్యం కల్గిస్తోందని లోకేశ్‌ అన్నారు. చంద్రబాబు అరెస్టు రాజకీయాల్లో భాగమని భావించడంలేదని అలాగైతే రాజకీయాల్లో నిజాయతీగా ఎందుకు పనిచేయాలన్న ప్రశ్న ఉదయిస్తుందన్నారు. జగన్‌ లాగా లక్ష కోట్లు తిని ఉంటే బాధుండదని విమర్శించారు. చేయని తప్పునకు తండ్రిని జైల్లో పెడితే ఏ కొడుక్కైనా బాధ ఉంటుందని అన్నారు.

తెలుగుదేశం పార్టీ ఏనుగు లాంటిందని, సిద్ధమవడానికి కొంత సమయం పడుతుందని లోకేశ్‌ అన్నారు. పరిగెత్తడం మొదలుపెట్టాక ఆపడం ఎవరి తరమూ కాదని స్పష్టం చేశారు. పార్టీ ఇప్పుడు పరుగెత్తే స్థితికి చేరిందని, అడ్డొచ్చిన ప్రతివారిని తొక్కుకుపోవడం ఖాయమని స్పష్టం చేశారు. కార్యకర్తలు ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలే ఇందుకు నిదర్శమని.... 23 రోజులుగా అధినేతను చూడకపోయినా క్షేత్రస్థాయిలో కేడర్‌ క్రియాశీలకంగా పనిచేస్తోందన్నారు. చేయని తప్పునకు శిక్షించే వ్యవస్థ ఉండకూడదని భావించి, ఈ వ్యవస్థను మార్చడానికే రాజకీయాల్లోకి వచ్చినట్లు లోకేష్‌ తెలిపారు.


స్కిల్‌ కేసు, జగన్‌ అక్రమాస్తుల కేసులు పూర్తి భిన్నమని.. జగన్‌ కేసుల్లో ప్రతి ఆరోపణకూ ఆధారాలున్నాయని లోకేష్‌ తెలిపారు. ఒక వ్యక్తి నాటి సీఎం వైఎస్‌ను కలిశాక వారికి అనుకూలంగా జీవోలు ఇచ్చారని, వెంటనే వారు జగన్‌ కంపెనీల్లో షేర్లు కొన్నారన్నారు. డబ్బులు బదిలీ అయ్యాయని, వాటికి సాక్ష్యాధారాలున్నాయని స్పష్టం చేశారు. స్కిల్‌ కేసులో అలాంటి రుజువులున్నాయా అని ప్రశ్నించారు. పైగా స్కిల్‌ కేసులో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ విధివిధానాలు ఎందుకు మార్చారని, క్షేత్రస్థాయిలో భౌతిక పరిశీలన ఎందుకు చేయించలేదని లోకేష్‌ ప్రశ్నించారు. ప్రస్తుతానికి జనసేనతో మాత్రమే కలిసి పనిచేస్తున్నామని, చంద్రబాబును కలిసిన ఐదు నిమిషాల్లోనే పవన్‌ కల్యాణ్‌ దీనిపై నిర్ణయం తీసుకున్నారని లోకేష్‌ చేప్పారు. 3వ తేదీ తర్వాత ఇరుపార్టీలతో సమన్వయ కమిటీ వేస్తామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story