తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో సైకిల్‌ స్పీడు..!

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో సైకిల్‌ స్పీడు..!
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అన్ని పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అన్ని పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని వ్యూహాలు సిద్ధం చేసింది టీడీపీ. ప్రచార గడువు ముగిసేలోపు ప్రతి ఇంటికి కనీసం పదిసార్లు వెళ్లేలా ప్లాన్ చేసింది. క్షేత్ర స్థాయిలో ఓటర్లను కలిసేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ప్రచారంలో పాల్గోనున్నారు.

సత్యవేడు నియోజకవర్గ పరిధిలో ప్రచారం మొదలు పెట్టనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పాదయాత్రగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తారు. వరదయ్యపాలెం మండల కేంద్రంలోని చెంగాలమ్మ ఆలయం, తూర్పు వీధి, బజార్‌ వీధి, పోలీస్‌స్టేషన్‌ మెయిన్‌ రోడ్‌, గోవర్ధనపురం, పద్మావతిపురం, ఇందిరానగర్‌ సెంటర్‌, సీఎల్‌ఎన్‌ పల్లి, లక్ష్మీపురం వరకు పాదయాత్ర సాగనుంది.

స్థానిక నాయకత్వానికి సహకరించడానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలను రంగంలోకి దింపింది టీడీపీ. నియోజకవర్గాల వారీగా కీలక నేతలకు బాధ్యతలు అప్పగించింది. అందరూ అక్కడే ఉంటూ పరిస్థితి సమీక్ష చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. బూత్ కమిటీల సాయంతో ఓటర్లతో మమేకం అవుతున్నారు. డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహిస్తూ.. పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపుతున్నారు. తిరుపతి లోక్‌సభ పరిధిలో ఉన్న ప్రతి గ్రామంలో పర్యటిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండ గడుతున్నారు.

టీడీపీ ఈసారి సేవ్ తిరుపతి నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అలాగే ప్రత్యేక హోదా, తిరుపతికి ఇచ్చిన హామీలను హైలైట్ చేస్తోంది. అలాగే పథకాల పేరుతో వాలంటీర్లు బెదిరించే అవకాశం ఉందని.. అలా ఎవరైనా బెదిరిస్తే వారి సమచారాన్ని పార్టీకి అందించాలని వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నంబర్‌కు కాల్ రికార్డు కానీ, ఫొటో కానీ వాట్సాప్ చేస్తే సంబంధిత వ్యక్తుల అకౌంట్‌లో 10 వేలు వేస్తామని హామీ ఇచ్చింది. తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు ఇది వర్తిస్తుందన్నారు నేతలు. ఇలా గతానికి భిన్నంగా టీడీపీ ముందుకు సాగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story