సీఎం జగన్‌కు నారా లోకేష్ లేఖ!

సీఎం జగన్‌కు మరోసారి లేఖ సంధించారు నారా లోకేష్. లోపభూయిష్టమైన ఇసుక విధానం కారణంగా మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణంలో తీవ్ర జాప్యం,తద్వారా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ జగన్ దృష్టికి తీసుకువచ్చారు లోకేష్. ఫిబ్రవరి 2న లోక్ సభ సమావేశాల సందర్భంగా అడిగిన ప్రశ్నకు సమాధానంగా గుంటూరు జిల్లా,మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణంలో జాప్యానికి ఇసుక కొరతే కారణమని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్ చౌబే పార్లమెంటుకు తెలిపారని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇసుక సరఫరా చెయ్యడం,డ్రైనేజీ, రహదారి నిర్మాణంతోపాటు ఎన్‌డీఆర్ఎఫ్ క్యాంపస్‌ను మార్చడం వంటి పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం కారణంగా మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణం ఆలస్యం అవుతోందని లోక్ సభలో సమాధానంగా చెప్పారని అన్నారు. కేంద్ర మంత్రి గారి సమాధానంతో వైసీపీ ఇసుక విధానం ఎంత చెత్తగా ఉందో,నిర్మాణ రంగం పై ఎంత ప్రభావం ఉందో మరోసారి బయటపడిందని ఎద్దేవా చేశారు.
పేదల ఆరోగ్య అవసరాలు తీర్చడంలో ఎయిమ్స్ దేశంలోనే కీలక పాత్ర పోషిస్తుందని, ఎయిమ్స్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చెయ్యడం వలన రోగులకు మేలు జరుగుతుందని లోకేష్ అన్నారు. స్థానికంగా ఎంతో మందికి ఉపాధి,ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కానీ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ నిర్ణయాల వలన ఎయిమ్స్ నిర్మాణం ఆలస్యం అవుతుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మాణం అవుతున్న ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకే ఇసుక సరఫరా కాకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు లోకేష్. కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమవవడంతోనే ఎయిమ్స్ నిర్మాణం నత్త నడకన సాగుతుందని తన లేఖలో ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com