Amma Vodi: అమ్మఒడికి, కరెంట్‌ బిల్లుకు లింక్‌ పెడుతూ ప్రభుత్వం కొత్త నిబంధన..

Amma Vodi: అమ్మఒడికి, కరెంట్‌ బిల్లుకు లింక్‌ పెడుతూ ప్రభుత్వం కొత్త నిబంధన..
Amma Vodi: అమ్మఒడికి మళ్లీ ఆంక్షలు విధించింది జగన్ ప్రభుత్వం.

Amma Vodi: అమ్మఒడికి మళ్లీ ఆంక్షలు విధించింది జగన్ ప్రభుత్వం. ఇక మీదట 300 యూనిట్లు దాటి కరెంట్‌ కాల్చితే అమ్మఒడి కింద 14వేల రూపాయలు అకౌంట్లో వేయడం జరగదు అంటూ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. పైగా ప్రతి విద్యార్ధికి 75 శాతం హాజరు తప్పనిసరి చేసింది. నవంబర్ 8 నుంచి ఏప్రిల్‌ 30 వరకు విద్యార్థి హాజరు 75శాతం లేకపోయినా అమ్మఒడి ప్రయోజనం పొందలేరు.

గతంలో పిల్లల్ని బడికి పంపిస్తే చాలు అమ్మఒడి కింద ప్రతి తల్లికి 15వేల రూపాయలు ఇస్తామన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా ఇస్తామన్నారు. ఆ తరువాత ఇంటికి ఒక్కరికేనంటూ పరిమితం చేశారు. మొదట్లో తెల్లకార్డు ఉంటే చాలు అమ్మఒడి ఇచ్చే వారు. ఆ తరువాత కరెంట్ బిల్లులకు లింక్ పెట్టారు. రెండో ఏడాది కల్లా.. మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో వేయి రూపాయల కోత పెట్టి 14వేలు ఇస్తున్నారు.

ప్రతి ఏడాది జనవరిలో అమ్మఒడి డబ్బులు వేస్తామన్న జగన్.. ఈ ఏడాది మాత్రం జూన్‌లో ఇస్తామంటూ ప్రకటించారు. దీనివల్ల ఒక ఏడాది ఇవ్వకుండా ఆపినట్లే అవుతుందంటున్నారు విశ్లేషకులు. అమ్మఒడి లబ్దిదారుల జాబితాను తగ్గించుకోడానికే జగన్ ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొస్తోందంటూ విమర్శిస్తున్నారు. ఆధార్‌ కార్డులో పాత జిల్లాల పేర్లు మార్చి కొత్త జిల్లాలను నమోదు చేసుకుంటేనే అమ్మఒడి ఇస్తామంటోంది ప్రభుత్వం.

దీంతో అమ్మఒడి కింద లబ్ధి పొందాలనుకునే వారంతా ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి.. అందులో పాత జిల్లా పేరును మార్చి కొత్త జిల్లా పేరు అప్‌డేట్‌ చేసుకోవాలి. పిల్లల్ని బడికి పంపితే చాలు 15వేలు ఇస్తామన్నప్పుడు.. ఇన్ని కొర్రీలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అమ్మఒడి దక్కాలంటే బియ్యం కార్డు కొత్తది ఉండాలనే నిబంధనల తీసుకొచ్చారు.

ఇంటింటి సర్వే మ్యాప్‌లో విద్యార్ధి, విద్యార్ధి తల్లి ఒకే మ్యాపింగ్‌లో ఉండాలి. విద్యార్థి ఈ-కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలి. వాలంటీర్ల వద్దకు వెళ్లి విద్యార్థి పేరు, వయసు సరిచూసుకోవాలి. అమ్మఒడి ఇచ్చేందుకు ఇవన్నీ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. పైగా విద్యార్థి వివరాలన్నీ కూడా సీఎస్సీ వెబ్‌సైట్‌లో చైల్డ్‌ ఇన్ఫోలో డేటాతో సరిపోవాలి. ఈ నిబంధనలన్నీ లబ్ధిదారుల జాబితాను తగ్గించేందుకే అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story