AP: జగన్‌ సభ నుంచి పారిపోయిన ప్రజలు

AP: జగన్‌ సభ నుంచి పారిపోయిన ప్రజలు
జగన్‌ ప్రసంగాలకు స్పందన కరువు... జనాన్ని తరలించేందుకు వైసీపీ నేతల నానాయాతన

ఏలూరులో నిర్వహించిన ఏపీ సీఎం జగన్‌ సభ నుంచి ప్రజలు పారిపోయారు. జగన్‌ ప్రసంగాలకు ప్రజల్లో పెద్దగా స్పందన కనపడడం లేదు. ఏలూరు నిర్వహించిన సిద్ధం సభతో జగన్ ప్రసంగం ప్రారంభించిన కొద్దిసేపటికే జనం ఇళ్ల బాట పట్టారు. వారం ముందు నుంచే సీఎం సభకు జనాన్ని తరలించాలని ప్రతి వాలంటీర్‌కు పార్టీ పెద్దలు లక్ష్యాన్ని నిర్దేశించారు. వారు సభలకు జనాన్ని తెచ్చేందుకు నానా యాతన పడ్డారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో జనాన్ని రప్పించేందుకు చాలాచోట్ల నాయకులు బతిమాలుకోవాల్సి వచ్చింది. ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం నియోజకవర్గానికి 70 బస్సులు ఏర్పాటు చేసినా...కేవలం పది బస్సుల్లో..అదీ పల్చగా ప్రజలు వెళ్లారు. సీఎం ప్రసంగం మొదలయ్యే సరికే వెనకనున్న గ్యాలరీలు ఖాళీ అయ్యాయి. ప్రసంగం సగం ముగిసేసరికి మరిన్ని గ్యాలరీలు బోసిపోయాయి. అప్రమత్తమైన పోలీసులు, నాయకులు ముందు గ్యాలరీల్లో ఉన్నవారిని బయటికి రాకుండా అడ్డుకున్నారు.

సభకు వెళ్లిన జనం నానా అవస్థలు పడ్డారు. పల్లెల నుంచి శనివారం ఉదయం 8 గంటలకే బస్సులు బయల్దేరగా...మధ్యాహ్నానికి వేదిక వద్దకు జనం చేరుకున్నారు. అక్కడ మండుటెండలో ఉక్కపోతతో అల్లాడిపోయారు. పలువురు సొమ్మసిల్లి పడిపోగా, కొందరు వాంతులు చేసుకున్న దృశ్యాలు కనిపించాయి. ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ స్పృహ తప్పి పడిపోగా వైద్య శిబిరానికి తరలించి సెలైన్‌ పెట్టారు. సభ వద్ద కుర్చీలు లేకపోవటంతో సాయంత్రం వరకు నిల్చోలేక కొందరు సీఎం రాకముందే వెళ్లిపోయి బస్సుల్లో కూర్చున్నారు. సభకు జనాన్ని తరలించేందుకు సుమారు 3 వేల వాహనాలు ఏర్పాటు చేయగా ఏలూరుకు వచ్చే అన్ని మార్గాల్లోనూ ట్రాఫిక్‌ స్తంభించింది. ఉదయం 11 గంటలకే దాదాపు 10 కిమీ మేర వాహనాలు ఆగిపోయాయి. సాయంత్రం సభ ముగిశాక 3 గంటల పాటు ట్రాఫిక్‌ సమస్య కొనసాగింది.

చెన్నై-కోల్‌కతా హైవేపై సభాస్థలికి సమీపంలో ఓచోట డివైడర్‌ను పగులగొట్టారు. సభ ప్రాంతంలో పిల్ల కాలువను కొంత పూడ్చేశారు. ఏలూరులో జగన్‌ ఫ్లెక్సీలు కన్పించేందుకు చెట్ల కొమ్మలు కొట్టేశారు. విద్యారంగాన్ని సంస్కరిస్తున్నామని చెప్పే సీఎం.. తన సభ కోసం ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షను వాయిదా వేయించారు. ప్రైవేటు విద్యాసంస్థలను మూసివేసి మరీ, సుమారు వెయ్యి బస్సులు తీసుకొన్నారు. సభకు హాజరైన వారికి వైసీపీ నేతలు ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పురుషులకు మద్యం సీసాలూ పంచారు. బస్సుల్లోనే బిర్యానీ పొట్లాలు ఇచ్చారు. మద్యం తాగిన కొందరు యువకులు బైక్‌పై వస్తున్న ఏలూరుకు చెందిన శ్రీనివాస్‌ను ఢీకొనడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. మద్య నిషేధం చేయకపోతే 2024లో ఓటు అడగనని ప్రగల్భాలు పలికిన జగన్‌..సభకు వచ్చిన వారిని మందులో ముంచేశారు. సిద్ధం సభ వైకాపా కార్యక్రమమే అయినా ..అధికార యంత్రాంగాన్ని భాగస్వాముల్ని చేశారు. బందోబస్తు, భద్రత చర్యలను పర్యవేక్షించాల్సిన పోలీసులు.. జనం సభ నుంచి వెళ్లిపోకుండా కాపలా కాశారు.

Tags

Read MoreRead Less
Next Story