TDP PROTESTS: ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యుల దీక్ష

TDP PROTESTS: ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యుల దీక్ష
పాల్గొన్న బాలకృష్ణ, తారకరత్న సతీమణులు... ఎన్టీఆర్ ఘాట్‌లో సుహాసిని దీక్ష

టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఎన్టీఆర్ కుటుంబసభ్యులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఎన్టీఆర్‌ కుమార్తె గారపాటి లోకేశ్వరి, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, గారపాటి శ్రీనివాస్‌, చలసాని చాముండేశ్వరి, తారకరత్న సతీమణి అలేఖ్యరెడ్డి, నందమూరి జయశ్రీ, సుధ, శిల్ప, దీక్షిత, రాహుల్‌, తారకరత్న కుమార్తె నిష్క పాల్గొన్నారు.


మరోవైపు ఎన్టీఆర్‌ ఘాట్‌లో నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని దీక్ష చేపట్టారు. ఆమెతో పాటు కేంద్రమాజీ మంత్రి పనబాక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. ‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అంటూ నినాదాలు చేశారు.


చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. హైదరాబాద్ లోని NTR భవన్ వద్ద రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ కాసాని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అన్యాయమైన పాలనకు ప్రజలు చరమగీతం పాడతారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వి స్టాండ్ విత్ చంద్రబాబు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

మరోవైపు చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ‘సత్యమేవ జయతే’ పేరుతో ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.. రాజమండ్రిలో క్వారీ సెంటర్‌ వద్ద చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిరశన దీక్షలో కూర్చొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా తొలుత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్ష చేపట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ముఖ్యనేతలు దీక్షలో కూర్చొన్నారు. ఢిలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఇంట్లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద లోకేశ్‌ దీక్షకు కూర్చొన్నారు. ఈ దీక్షలో ఎంపీలు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు.


ఏపీ ప్రభుత్వంపై ఎన్టీఆర్ మనమడు గారపాటి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్టీఆర్, చంద్రబాబు కుటుంబ సభ్యులను వైసీపీ నేతలు కించపరిచినప్పుడు మహిళా కమిషన్ ఎటు పోయిందని ప్రశ్నించారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలు గాజులు తొడుక్కుని కూర్చున్నారని విమర్శించారు. భువనేశ్వరి, బ్రహ్మణి, లోకే‌శ్‌లకు ఎన్టీఆర్ ఫ్యామిలీ అండగా ఉంటోందని తెలిపారు. ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తే రేపటి తరాలకు ఏం నేర్పిస్తారని నిలదీశారు.

Tags

Read MoreRead Less
Next Story