TDP: జగన్‌... సునీత ప్రశ్నలకు సమాధానం చెప్పు

TDP: జగన్‌... సునీత ప్రశ్నలకు సమాధానం చెప్పు
ప్రతిపక్షాల డిమాండ్‌... బాబాయ్‌ కుటుంబానికే న్యాయం చేయని జగన్‌ ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నలు

వివేకా హత్యకేసుకు సంబంధించి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి సంధించిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. సమాధానం చెప్పకుండా తప్పించుకుంటే ఎలా అని ప్రశ్నించారు. చెల్లెలే అనుమానిస్తుంటే... ముఖ్యమంత్రి స్థానంలో ఇంకా కొనసాగే నైతికత జగన్ కు ఉందా అని వర్ల రామయ్య నిలదీశారు.


మాట్లాడితే చాలు నా అక్కచెల్లెమ్మలు అంటూ ఊదరగొట్టే సీఎం జగన్...సొంత బాబాయి కుటుంబానికే న్యాయం చేయలేకపోయారని బీజేపీ నేత సత్యకుమార్ విమర్శించారు. అధికారం చేపట్టి ఐదేళ్లైనా వివేకానందరెడ్డిని హత్య చేసిందెవరో తేల్చలేకపోతున్నారన్నారు. దర్యాప్తు సంస్థల విచారణను అడ్డుకుని నిందితులను కాపాడుతున్న జగన్ తీరు చూసి వైసీపీకి ఓటేయొద్దని బాబాయి కుమార్తే చెబుతోందని సత్యకుమార్ అన్నారు. తన తండ్రి మరణంపై ప్రజాకోర్టే తీర్పు ఇవ్వాలని సునీత కోరుతున్నారన్నారు. జగన్ పాత్రపైనే విచారించాలని సునీత అడుగుతున్నారంటే...వారి కుటుంబంలో జగన్ పై ఎంత నమ్మకం ఉందో అందరికీ అర్థమవుతుందన్నారు.


మరోవైపు... పక్క రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే కనీసం రాజధాని కూడా లేని దయనీయ స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉందని. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్షనేతగా కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే సాగిల పడ్డారని ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీని మోసం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పది సంవత్సరాల ప్రత్యేక హోదా వచ్చేలా చేస్తుందని తిరుపతిలో నిర్వహించిన న్యాయ సాధన సభలో..... షర్మిల హామీ ఇచ్చారు. ఇది ప్రత్యేక హోదా కోసం ఆరాటపడే వారికి, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టే వారికి మధ్య పోరాటమని అన్నారు.

మరోవైపు జగన్ ప్రభుత్వం... తప్పుడు కేసులతో ప్రతిపక్షాల్ని తొక్కేసే ప్రయత్నం చేస్తుందని..... మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. కక్ష సాధింపు, విధ్వంసం రెండు కళ్లుగా జగన్ తన ఐదేళ్ల పాలన సాగించారని మండిపడ్డారు. గద్దె దిగే సమయంలో కూడా అదే విధ్వేషంతో వ్యవహరిస్తున్నారని ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story