TDP: అదే హోరు... నిరసనల జోరు

TDP: అదే హోరు... నిరసనల జోరు
చంద్రబాబు అరెస్ట్‌పై వాడవాడల ఎగిసిపడుతున్న ఆందోళనలు.. భగ్గుమంటున్న ప్రజలు

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల నిరసనలు కొనసాగిస్తున్నారు. అధినేతను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీలు, పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు

చంద్రబాబుకు మద్దతుగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో కొత్తపేట నియోజకవర్గానికి చెందిన మహిళలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తెదేపా జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి, మాజీ ఎమ్మెల్యే బండారు సతీమణి కమలారాణి దీక్షలో పాల్గొన్నారు. సీఎం జగన్ చేస్తున్న అరాచకాలను ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారని మహిళలు హెచ్చరించారు. చంద్రబాబు వెంటనే జైలు నుంచి బయటకు రావాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా సింగుపురంలో మహిళలు ముర్రాటలతో అసిరితల్లి అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భీమునిపట్నంలో తెదేపా నేతలు వినూత్నంగా జలదీక్ష చేపట్టారు.


చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ కడప ప్రకాష్ నగర్ లో బీసీ సంఘం నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, కడప ఇన్ ఛార్జ్ మాధవి రెడ్డి దీక్షకు హాజరై సంఘీభావం తెలిపారు. రాష్ట్రానికి దిక్సూచి లాంటి వ్యక్తిని జైల్లో పెట్టి వేధిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీఎం కావడం తథ్యం అని తెదేపా నేతలు ధీమా వ్యక్తం చేశారు. తెదేపాను ఓడించటం వైకాపా తరం కాదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు వెంటే ఉన్నారని శ్రీనివాసులరెడ్డి తెలిపారు.


చంద్రబాబుకు బెయిల్‌ రావాలని కోరుతూ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో మహిళలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 108 కొబ్బరికాయలు కొట్టి వేడుకున్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. చిలుకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేపట్టారు. నరసరావుపేటలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ర్యాలీ నిర్వహిస్తుండగా నియోజకవర్గ ఇన్‌ఛార్జి చదలవాడ అరవిందబాబును పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ శ్రేణులు ఆందోళనతో విడిచిపెట్టారు.

చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ అనంతపురం జిల్లా ఉరవకొండలో ముస్లిం మైనారిటీలు రిలే నిరహార దీక్ష చేపట్టారు. సైకో హటావో.. సైకిల్ బచావో అంటూ నినదించారు. ప్రభుత్వానికి, సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబుపై వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మైనారిటీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story