LOKESH: లోకేశ్‌ నేతృత్వంలో మోదీ సభ ఏర్పాట్లు

LOKESH: లోకేశ్‌ నేతృత్వంలో మోదీ సభ ఏర్పాట్లు
ఈనెల 17న ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ.... బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని

వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చలేదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. అనంతపురం, తాడిపత్రిలో జరిగిన శంఖారావం సభలో ప్రసంగించిన లోకేశ్ నిరుద్యోగ యువతను సీఎం జగన్ మోసం చేశారని ఆరోపించారు. కొత్త నోటిఫికేషన్లు వస్తాయని యువత ఆశగా ఎదురు చూసిందని చెప్పారు. సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి మాట తప్పింది జగన్ కాదా అని ప్రశ్నించారు. ఐదేళ్లలో చేయని పనులు ఇప్పుడిప్పుడే జగన్ కు గుర్తుకొస్తున్నాయని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లూ ఏం చేశారో జగన్ ను ప్రజలు నిలదీయాలని కోరారు. తెలుగుదేశం- జనసేన- భాజపా పొత్తుతో సీఎం జగన్ కు వణుకు మొదలైందని లోకేశ్ అన్నారు.


మరోవైపు ప్రధాని మోదీ పాల్గొనే మూడు పార్టీల తొలి బహిరంగ సభ ఈ నెల 17నే నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. చిలకలూరిపేట బొప్పూడి వద్ద నిర్వహించే ఈ సభ తేదీని నేతలు ఖరారు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నేతృత్వంలో సభ నిర్వహణ ఏర్పాట్లు జరగనున్నాయి. మరోవైపు జనసేన ఏడు అసెంబ్లీ స్థానాలను ఇప్పటికే ప్రకటించింది. నెల్లిమర్ల, అనకాపల్లి, కాకినాడ రూరల్, రాజానగరం, రాజోలు, నిడదవోలు, తెనాలి స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్‌ వెల్లడించారు. మిగిలిన 24 స్థానాల్లో జనసేన, భాజపాలు ఎవరెక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై సందిగ్ధత నెలకొంది. బీజేపీ మంగళవారం ప్రకటిస్తుందనుకుంటున్న ఎంపీ అభ్యర్థుల రెండో జాబితాలో ఏపీ నుంచి పలువురు అభ్యర్థుల పేర్లు ఉండవచ్చని తెలుస్తోంది.


వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన - బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వచ్చింది. పొత్తులో భాగంగా బీజేపీ - జనసేనకు అదనంగా మరో అసెంబ్లీ స్థానం కేటాయించారు. మొత్తం 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాల్లో ఈ రెండు పార్టీలు పోటీ చేయనున్నాయి. వీటిలో 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో కమలం పార్టీ.. 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో జనసేన బరిలోకి దిగనున్నాయి. మిగిలిన చోట్ల తెదేపా పోటీ చేయనుంది. ఈ మేరకు ఉండవల్లిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశంలో.. కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, భాజపా జాతీయనేత బైజయంత్‌ ఏకాభిప్రాయానికి వచ్చారు. అనంతరం మూడు పార్టీలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.

Tags

Read MoreRead Less
Next Story