PROTESTS: నిరసనలు.. హోమాలు... పూజలు

PROTESTS: నిరసనలు.. హోమాలు... పూజలు
చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు జైలు నుంచి త్వరగా విడుదల కావాలని కోరుతూ టీడీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశాయి. గుంటూరు తెలుగుదేశం BC విభాగం ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. శంకర్ విలాస్ కూడలి నుంచి హిందూ కాలేజి కూడలి వరకు ప్రదర్శన చేశారు. పూలే విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. బాపట్ల జిల్లా J.పంగులూరు మండలంలో అద్దంకి MLA గొట్టిపాటి రవి 9వ రోజు సైకిల్ యాత్ర నిర్వహించారు. ముప్పవరం S.C. కాలనీ నుంచి రామకూరు వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర సాగింది. YSRజిల్లా ప్రొద్దుటూరు మాజీ MLA వరదరాజులు అధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు జైలు నుంచి త్వరగా విడుదల కావాలని కోరుతూ రామేశ్వరంలోని ముక్తిరామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. నంద్యాల జిల్లా మహానందిలో 101 కొబ్బరికాయలు కొట్టి తెదేపా నేతలు మొక్కులు చెల్లించుకున్నారు. చంద్రబాబు కుటుంబం బాగుండాలని మహనందీశ్వర స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం కుదుటపడాలని, త్వరగా జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ కర్నూలు జిల్లా పత్తికొండలో చండీయాగం నిర్వహించారు.


చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మచిలీపట్నంలో సైకిల్ యాత్ర చేపట్టిన టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బందరు కోట దేవాలయంలో పూజలు చేసేందుకు వచ్చిన కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. సైకిల్ యాత్రకు అనుమతి లేదన్నారు. విజయవాడలో టీడీపీ బీసీ నేతలు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. కొల్లు రవీంద్ర పిలుపుమేరకు టీడీపీ బీసీ నేతలు సైకిల్ ర్యాలీ చేపట్టారు. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా నేతలు రోడ్డుపై బైఠాయించారు. చంద్రబాబుకు మద్దతుగా సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కోనసీమ జిల్లా ముమ్మిడివరం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో తెదేపా నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ MLA దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సుబ్రహ్మణ్యస్వామికి మొక్కుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాజీ MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనపర్తి మండలం దుప్పలపూడిలోని... పుంతలో ముసలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story